తాడిపత్రి రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు, ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగుల బ్యాలెట్ పత్రాలు ముంద్రించనున్నారు. బ్యాలెట్ పత్రాలపై ఆయా పార్టీల గుర్తులు ఉండనున్నాయి. జాతీయ పార్టీల అభ్యర్థుల గుర్తులు మొదట, ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల గుర్తులు ఉండనున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల కోసం 60 రకాల గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. అభ్యర్థులు మూడు గుర్తులను ఎంపిక చేసుకొని ఆర్‌ఓకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఒకే గుర్తు అడిగితే వారికి లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు.
గుండెపోటుతో ఏఈఓ మృతి
తాడిపత్రిటౌన్: పట్టణంలోని అశోక్ పిల్లర్ వద్ద గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఏఈఓ రమేష్ (36 ) గుండెపోటుతో మృతిచెందాడు. వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కొండాపురం మండలం ఏటూరుకు చెందిన రమేష్..రైల్వే కొండాపురంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తూ తాడిపత్రిలోని సంజీవ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య సరస్వతి, కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి
కుందుర్పి: మండలంలోని తూముకుంటకు చెందిన మంజు (38) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన మంజునాథ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా బెస్తరపల్లిలోని ఇళ్ల నిర్మాణాలకు తూముకుంట నుంచి మట్టి తరలిస్తున్నాడు. గురువారం తూముకుంట నుంచి మట్టి తోలుతుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ గోతిలో పడిపోయింది. దీంతో మంజునాథ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సదరం స్లాట్ల విడుదలకు అనుమతి
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దివ్యాంగులకు ఊరట లభించింది. సదరం ధ్రువీకరణ పత్రాల జారీ కోసం సాధారణ వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు అర్చన తెలిపారు.
ప్రచారం అడ్డుకునేందుకు కుటిల రాజకీయం
పెద్దవడుగూరు :మండ లంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారం చేయకుండాచేయడానికి కూటమి నేతలు కుటిల రాజ కీయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి నిర్మల, దిమ్మగుడి ఎంపీటీపీ అభ్యర్థి మదన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జెడ్పీటీసీ అభ్యర్థి ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఆమె వాహనాన్ని పోలీసులు అటకాయించి.. అనుమతులు లేవంటూ స్టేషన్‌కు తరలించారన్నారు. అభ్యర్థిని కూడా గంటపాటు స్టేషన్‌లోనే ఉంచారన్నారు. తమకు కేవలం రోజుకు గంట మాత్రమే ప్రచారం చేసుకోవాలని పోలీసులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని అభ్యర్థులు వాపోయారు.


