● కాగితాలకే పరిమితమైన సామాజిక తనిఖీ
● పంటనష్టం తగ్గించి పంపేందుకు చర్యలు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులను తట్టుకొని అతికష్టమ్మీద సాగులోకి వచ్చిన 3.24 లక్షల హెక్టార్ల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం పెద్దవడుగూరు మినహా మిగతా 30 మండలాలను కరువు జాబితాలోకి ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో 28 మండలాలు తీవ్ర కరువు జాబితాలో ఉన్నాయి. కాగా, రాయదుర్గం, పెద్దపప్పూరును మధ్యస్థ కరువు జాబితా కింద గుర్తించారు. వర్షపాతం అధికంగా ఉందని పెద్దవడుగూరు మండలాన్ని పక్కనపెట్టేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా పంటనష్టం అంచనాలు చేపడుతున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనల మేరకు స్కేల్ ఆఫ్ రిలీఫ్ (పంటనష్టం ఉపశమనం) ఆధారంగా పంటనష్టం రూ.400 కోట్లు వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈనెల 17 నాటికే పంటనష్టం జాబితాలు సిద్ధం కావాల్సి ఉంది. ఇంకా 95 శాతం పూర్తయినట్లు చెప్తున్నారు. తయారు చేసిన జాబితాలు ఆర్‌ఎస్‌కేల్లో ఈనెల 25 నుంచి 27 వరకు సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించి, ఏవైనా అభ్యంతరాలు, పొరపాట్లు ఉంటే సవరించుకునే వెసులుబాటు ఉన్నా... జాబితాలు ఎక్కడా ప్రదర్శించిన దాఖలాలు కనిపించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఆలోచనతో అక్కడక్కడ ఆర్‌ఎస్‌కేల్లో అలా ఉంచి మమ అనిపించినట్లు చెప్తున్నారు.
1,2న కరువు బృందం జిల్లాలో పర్యటన..
కరువు పరిశీలన నిమిత్తం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (కేంద్ర బృందం) నవంబర్ 1, 2న జిల్లాకు వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంతలోపు జిల్లా సమగ్ర కరువు నివేదిక తయారు చేసి కేంద్ర బృందానికి అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 95 శాతం పూర్తయిందని చెబుతున్నా, రాయదుర్గం, పెద్దపప్పూరు మండలాల జాబితా ఇంకా తయారు కాలేదంటున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 2.23 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో 1.82 లక్షల మంది రైతులకు రూ.200 కోట్లు వరకు పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ప్రాథమిక అంచనా మేరకు రూ.400 కోట్లు పైగా రావాల్సిన పంటనష్టం కాస్త ఇటు ఇటుగా రూ.200 కోట్లకు కుదించే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పంటనష్టం తగ్గించి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.


