అనంతపురం కల్చరల్: విజయవాడ బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ గొర్తి శ్రీనివాసరావు మృతి బాధాకరమని, ఆయన మరణంపై అనుమానాలున్నాయని మాజీ ప్రభు త్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు. గురువారం ఆయన నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గొర్తి శ్రీనివాసరావు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సొసైటీలోని బుచ్చి రాంప్రసాద్, ఎండీ చంద్రశేఖర్ ఆజాద్, సీఈవో నాగసాయి, బాలా త్రిపుర సుందరి పాత్రపై అనేక అనుమానాలున్నాయని, దీనిపై సమగ్ర విచారణకు వెంటనే ఆదేశించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన రెండున్నరేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు బ్రాహ్మణులకు పారదర్శకంగా అందేవని, నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమయ్యేవని గుర్తు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసి, దోషులు ఎంతటి స్థానంలో ఉన్నా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.


