●జేసీ అస్మిత్‌రెడ్డి– ప్రభాకర్‌రెడ్డిలకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్
అనంతపురం: ‘తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, ఆయన తండ్రి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి హింసా రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. వారికి దమ్ము, ధైర్యం గనుక ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ‘స్థానిక’ ఎన్నికల్లో లేదా రాజకీయంగా ఎదుర్కోవాలి’ అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ చేశారు. సోమవారం ఆయన అనంతపురంలోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. జేసీ కుటుంబం చట్టబద్ధంగా రాజకీయాలు చేయడం చేతకాక అడ్డదారుల్లో ప్రత్యర్థులను అణచివేయాలని చూస్తోందని విరుచుకుపడ్డారు. జేసీ వర్గీయులు కొందరు స్థానిక పోలీసులు, గంజాయి ముఠాలను అడ్డుపెట్టుకుని తాడిపత్రి పట్టణంతో పాటు గ్రామాల్లో అరాచకాలకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తన స్వగ్రామం తిమ్మంపల్లిలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎస్సీ మహిళా అభ్యర్థి నామినేషన్ వేయకుండా ఉండేందుకు తనను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు. అభ్యర్థిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే నిర్బంధించి.. సమయం ముగిశాక తాపీగా వెనక్కు పంపారన్నారు.
ఇళ్లపై రాళ్లదాడులు చేసినా కేసుల్లేవ్
తాను స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్లిన సమయం చూసి.. తాడిపత్రిలోని తన నివాసంపై జేసీ వర్గీయులు రాళ్ల దాడులకు తెగబడ్డారని పెద్దారెడ్డి ఆరోపించారు. తన ఇంటిపైనే కాకుండా పట్టణంలోని నలుగురు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపైనా దాడులు చేసి, ఆస్తుల విధ్వంసాలతో పాటు దోపిడీలకు పాల్పడ్డారన్నారు. ఈ ఘటనలపై బాధితులు ఫిర్యాదు చేసినా జేసీ ప్రభాకర్‌రెడ్డిపై, ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేయలేదని మండిపడ్డారు. పోలీసు కానిస్టేబుళ్ల ద్వారా తనపై తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి మరీ అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు జేసీ కుటుంబానికి తొత్తులుగా మారడం అత్యంత బాధాకరమన్నారు.
ఎస్పీపై బ్లాక్‌మెయిల్ రాజకీయాలు
ఎస్పీ జగదీష్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యూహాత్మకంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేందుకే పదేపదే పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నాలు, ఆందోళనలతో రచ్చ చేస్తున్నారని తెలిపారు. ఈ అరాచకాలపై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని, రౌడీ మూకలపై, అక్రమాలకు పాల్పడుతున్న జేసీ వర్గీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు ప్రజల తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని పెద్దారెడ్డి హెచ్చరించారు.


