విడపనకల్లు: గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు (జీబీసీ) సోమవారం సాగునీరు బంద్ చేశారు. జీబీసీకి నవంబర్ పదో తేదీ వరకు నీరు వదలాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్‌లో నీరు తగ్గుముఖం పడుతోంది. ఇదే క్రమంలో తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో నీరు వృథా కాకూడదనే ఉద్దేశంతో జీబీసీకి నీరు బంద్ చేసినట్లు డీఈ మంజునాథ్ తెలిపారు. వర్షాలు కురవకపోతే రెండు రోజుల్లో నీటి విడుదలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రస్తుతం లీకేజీ నీరు మాత్రమే కెనాల్‌లో పారుతోంది.
రైతుల్లో ఆందోళన..
జీబీసీ కింద ఆయకట్టు రైతులు దాదాపు 16 వేల ఎకరాల్లో పత్తి, మిరప, వరి, తదితర పంటలు సాగు చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నఫళంగా నీరు బంద్ చేయడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. నీరందక పంటలు ఎండిపోతే లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. పంటలు దెబ్బతినకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
ప్రచారంలో ‘పచ్చ’ పాతం
కళ్యాణదుర్గం: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గెలుపు అవకాశాలు లేకుండా చేయడానికి అధికార టీడీపీ అధికారులపై ఒత్తిడి తెస్తోంది. మున్సిపల్, పోలీసు అధికారులు కూడా వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇదీ కళ్యాణదుర్గంలో అధికారులు చూపుతున్న ‘పచ్చ’పాతం. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కార్యక్రమాల నిర్వహణ, ప్రచారాలు, వాహనాలు, మైక్‌లకు అనుమతులు ఇవ్వకూడదని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్, పోలీసులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. నిబంధనల పేరుతో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
అధికారుల తీరుపై మండిపాటు
వైఎస్సార్‌సీపీ నాయకులకు మైకులు, వాహన అనుమతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న మున్సిపల్, పోలీసు అధికారులు.. అధికార టీడీపీ నేతల వాహనాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అధికారులు మాత్రం టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి.. ప్రతిపక్ష పార్టీలకు ఆంక్షలు విధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థులు మైక్, వాహనాల అనుమతి కోసం మున్సిపల్ కార్యాలయం, పోలీసుస్టేషన్ వద్ద పడిగాపులు కాశారు. ఎట్టకేలకు సాయంత్రం అనుమతులు ఇవ్వడంతో అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేశారు.


