ఓటమి భయంతో నీచ రాజకీయం | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో నీచ రాజకీయం

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

అనంతపురం: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఓడిపోవడం ఖాయమని తెలుసుకున్న సీఎం చంద్రబాబు నీచపు రాజకీయాలకు తెరలేపారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ మండిపడ్డారు. చినబాబు రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలు, కుతంత్రాలతో ఎన్నికల ప్రక్రియను ఓ ప్రహసనంలా మార్చేశారంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా దాడులు చేయడం, పత్రాలను లాక్కుని చించివేయడం వంటి దురాగాలకు పాల్పడిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్ల కార్యాలయాల్లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని కోరారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద వెన్నుపోటు పార్టీ నేతలు, కూటమి నాయకులు, వారి అనుచరులు చెప్పినట్లు అధికారులు పని చేస్తున్న తీరుపై కూడా విచారణ జరగాలని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నాడు కార్యకర్తలను నట్టేట ముంచి..

నీతి సూక్తులు వల్లె వేయడంతో చంద్రబాబు ప్రవచనకర్తలను మించిపోయారని శైలజానాథ్‌ ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ నాయకత్వం, ఇప్పుడు ఏకగ్రీవాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. నాడు ఎన్నికలను బహిష్కరించడం ద్వారా టీడీపీ అభ్యర్థులను, కార్యకర్తలను నట్టేట ముంచారన్నారు. ‘వైఎస్సార్‌ కడప జిల్లాలోని చక్రాయపేటలో కూటమి నేతలతో కుట్ర పూరితంగా 11 ఫేక్‌ నామినేషన్లు వేయించినది వాస్తవం కాదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. అలాగే పెండ్లిమర్రి ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఫేక్‌ నామినేషన్లకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేతలు చేసిన ఫిర్యాదులపై అధికారులు కనీస పరిశీలన చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్ఛ..

గుత్తి, గుంతకల్లు, పుట్లూరు, యల్లనూరు ప్రాంతాల్లో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చగా నిలుస్తాయని శైలజానాథ్‌ పేర్కొన్నారు. యల్లనూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ ఎస్సీ మహిళా ఎంపీటీసీ అభ్యర్థిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉద్దేశపూర్వకంగా నిర్బంధం చేసి, నామినేషన్‌ గడువు ముగిసిన తర్వాత బయటకు పంపడం హక్కుల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఇక నామినేషన్ల పరిశీలనలో కొన్ని చోట్ల సరైన కారణాలు తెలియజేయకుండానే నామినేషన్లను తిరస్కరించారన్నారు. బుక్కరాయసముద్రం ప్రాంతంలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు స్వీకరించిన సమయంలో అన్నీ సక్రమంగా ఉన్నట్లు రసీదు ఇచ్చారని, పరిశీలన సమయంలో కొన్ని పత్రాలు మాయం కావడం వెనుక ఎవరి హస్తముందో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న దాడులు, బెదిరింపులు, నామినేషన్ల తిరస్కరణలు, పత్రాల గల్లంతు, నకిలీ నామినేషన్ల అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బోనాల హరికృష్ణ, నియోజకవర్గ బూత్‌ కమిటీ వింగ్‌ అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మంత్రి ఆంజనేయులు, నాయకుడు మారుతీ తదితరులు పాల్గొన్నారు.

చినబాబు భవిష్యత్తు కోసం

చంద్రబాబు దురాగతాలు

వెన్నుపోటు పార్టీ నేతల కనుసన్నల్లో

ఆర్‌ఓలు, అధికారులు

ఆర్‌ఓ సెంటర్లలో సీసీ టీవీ ఫుటేజీని

భద్రపరచాలి

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement