ప్రభుత్వ యంత్రాంగం ‘పచ్చ’పాతం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ యంత్రాంగం ‘పచ్చ’పాతం

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

అనంతపురం న్యూటౌన్‌: ప్రభుత్వ యంత్రాంగం సైతం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తూ ‘పచ్చ’ భక్తిని చాటుకుంటోంది. నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి తెరచాటుగా యంత్రాంగం చేసిన ఘనకార్యాలు స్క్రూటినీలో వెల్లడి కావడం విస్మయానికి గురిచేస్తోంది. కూటమి నేతల అడుగులకు మడుగులొత్తే విధంగా కొందరు ‘పచ్చ’ మాస్కులు వేసుకున్న అధికారుల ఏకపక్ష వ్యవహారాలు బహిర్గతం అవుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ జరగక ముందే, సహేతుక కారణాలు వెల్లడించకుండానే వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రధానంగా గుంతకల్లు, అనంతపురం, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, పామిడి, గుత్తి, రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ తదితర మండలాల పరిధిలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియల్లో చోటుచేసుకున్న ఉదంతాలు ఎన్నికల అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. గుంతకల్లు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీలత నామినేషన్‌ ఉపసంహరణ విషయంలో ఓ అధికారిణి అత్యుత్సాహంతో వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నామినేషన్ల పరిశీలన రోజే (శనివారం) ఆమె నామినేషన్‌ ఉపసంహరించుకుందంటూ లీకులిచ్చారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో సదరు ఎన్నికల ‘అధికారిణి’ ‘పచ్చ’పాత ధోరణితో వ్యవహరించినట్లు తెలుస్తోంది. నార్పల జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బూసుపల్లి శివానందరెడ్డి మరో అభ్యర్థికి ప్రతిపాదకుడిగా సంతకం చేశారన్న నెపంతో నామినేషన్‌ తిరస్కరించారు. మొదట ఈయన నామినేషన్‌ విషయంలో ఇతర పార్టీల నుంచి ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు. అదే సమయంలో జెడ్పీలో అన్నీ తానై వ్యవహరించే ఓ అధికారి ప్రత్యేక చొరవ తీసుకుని శివానందరెడ్డి నామినేషన్‌ ఇన్‌వ్యాలిడ్‌ అయ్యేలా అధికార పార్టీకి సహకరించినట్లు తెలుస్తోంది. ‘పచ్చ’ పార్టీ అక్రమాల ‘లెక్కల’కు సదరు అధికారి తనవంతు సహకారం అందించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక కొందరు అధికారులకు ఇష్టం లేకపోయినా కూటమి నేతల ఒత్తిడికి తలొగ్గి వ్యవహరించినట్లు తెలుస్తోంది.

అధికార పార్టీకి జీ హుజూర్‌

నామినేషన్ల పరిశీలనలో

బహిర్గతమైన ఏకపక్ష వైఖరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement