రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలంలో ఎంపీటీసీ నామినేషన్ దాఖలు సందర్భంగా టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన కొడిమికి చెందిన బండి చినరాముడు శస్త్రచికిత్స జరిగినా ఇంకా కోమాలోనే ఉండటం కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 22న కొడిమికి చెందిన కడియాల తిరుపాల్‌రెడ్డి ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు రూరల్ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ గ్రామ సీనియర్ నాయకుడు, మాజీ డీలరు, మండల కన్వీనరు బండి పవన్ చిన్నాన్న బండి చినరాముడు కూడా వెళ్లారు. కార్యాలయంలోకి వెళ్తున్న సమయంలో టీడీపీకి చెందిన కొందరు అడ్డుకుని నామినేషన్ పత్రాలను చించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చినరాముడిపై రాయితో బలంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు.
శస్త్రచికిత్స జరిగినా కోమాలోనే..
తీవ్రంగా గాయపడిన చినరాముడును తొలుత సర్వజన ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తలలోని పుర్రెకు గాయం కావడంతో రెండు రోజుల కిందట శస్త్రచికిత్స నిర్వహించారు. అయినప్పటికీ బాధితుడు ఇంకా కోమాలోనే ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఒక నామినేషన్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న దాడి ఓ వ్యక్తి ప్రాణాలకే ముప్పుగా మారడం కలవరపెడుతోంది.
కేసు నమోదుతోనే సరిపెట్టొద్దు..
ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్త్‌త్రతంగా ప్రచారం కావడంతో ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. అనంతరం పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పాపంపేటకు చెందిన భానుకోట రామాంజనేయులు, మద్దినేని కృష్ణ, భరత్‌చౌదరి, నందమూరినగర్‌కు చెందిన చల్లా జయకృష్ణ, మనోహర్‌నాయుడు, కురుగుంటకు చెందిన ధర్మేంద్రతో పాటు మరికొందరిపై బీఎన్‌ఎస్ 118 (1), 126(2), 223, 351(2), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదైంది. వైద్య నివేదికల ఆధారంగా బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించడంతో పాటు, ఎన్నికల సమయంలో అభ్యర్థులు, వారి అనుచరులకు తగిన రక్షణ కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
నామినేషన్ వేయడానికి వెళ్తే
రాళ్లతో టీడీపీ నాయకుల దాడి
శస్త్రచికిత్స జరిగినా
కోలుకోని బాధితుడు
ఆరుగురు టీడీపీ నాయకులతో పాటు మరికొందరిపై కేసు నమోదు


