మతసామరస్యానికి ప్రతీక దర్గాహొన్నూర్‌ | - | Sakshi
Sakshi News home page

మతసామరస్యానికి ప్రతీక దర్గాహొన్నూర్‌

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

బొమ్మనహాళ్‌: జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దర్గాహోన్నూరు స్వామి దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. దర్గాహొన్నూరు గ్రామంలో వెలసిన వన్నూర్‌స్వామి దర్గాలో ఈనెల 27 నుంచి నవంబర్‌ 1 వరకు ఉరుసు నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. తొలిరోజు మంగళవారం గంధం, 28న బుధవారం ఒకటవ దీపారాధన, 29న గురువారం రెండవ దీపారాధన, 30వ తేదీన శుక్రవారం ఉరుసే ఫరిఫ్‌ (దేవుడి సవారీ), 31న శనివారం జియారత్‌, నవంబర్‌ 1న ఫకీర్ల సభ ఉంటుందన్నారు.

వన్నూరుస్వామి దర్గా చరిత్ర ఇది..

సుమారు 700 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పాలేగాళ్లు పరిపాలిస్తున్న సమయంలో మహహ్మద్‌ ప్రవక్త శిష్యుడైన సయ్యద్‌ సర్మస్‌ హుసేన్‌ చిస్తి మత ప్రచార నిమిత్తం దర్గాహోన్నూరుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన హోన్నూరులో గవిపుల్లను నాటగా అది చిగురించడంతో తన ప్రచారం ఇక్కడి నుంచి ప్రారంభించారు. కానీ ఈ ప్రాంతంలో కులమతాలపోరు అధికంగా ఉండటంతో మత ప్రచారానికి బదులు హిందూ, ముస్లింల ఐక్యతకు విశేషంగా కృిషి చేశారు. ఇందుకు ముగ్దులైన పాలేగాళ్లు మండలంలోని కల్‌హోళ వద్ద 15 ఎకరాలు, రాయదుర్గం తాలుకాలోని కొండాపురం గ్రామంలో 1200 ఎకరాల మాన్యాన్ని ఇనామ్‌గా ఇచ్చారు. ఆప్పటి నుంచి ఆయన ఈ ప్రాంతంలో శాంతిస్ధాపనకు పాటుపడుతూ చివరికి హొన్నూర్‌లో సమాధి అయ్యారు. హొన్నూరు కాస్త దర్గాహోన్నూరుగా మారింది. ఆయన హిందూ ముస్లింకు ఆరాధ్యదైవంగా మారిపోయారు.

అందరివీ అవే పేర్లు..

ప్రతి గురువారం వందలాది మంది భక్తుల ప్రత్యేక పూజలు , ప్రార్థనలు నిర్వహించి తమ మొక్కలను తీర్చుకుంటారు. ఈ ప్రాంతంలో తమ పిల్లలకు హిందూవులు వన్నూర్‌స్వామి, వన్నూరప్ప, వండ్రప్ప, వండ్రమ్మ, వన్నూరమ్మ అని ముస్లింలు అయితే వన్నూర్‌సాబ్‌, వన్నూర్‌వలి, వన్నూర్‌బీ అంటూ ఆ గ్రామంలో 90 శాతం మందికి పైగా స్వామివారి పేర్లు పెట్టుకోవడం అనవాయితీ. ఏటా స్వామి వారి ఉరుసు ఉత్సవాలను హిందూవులు, ముస్లింలు కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లొ దర్గాహోన్నూర్‌ పంచాయతీలొని వన్నల్లి గ్రామంలో హిందూవుల ఇంటి వద్ద నుంచి గంధం తెచ్చి పూజా కార్యక్రమాలు ప్రారంభించడం విశేషం. సంవత్సర మంతా సంచారం వెళ్ళిన స్వామివారి షంషేర్‌ సవారీ గుర్రం ఉరుసు సమయానికి వచ్చి ఉరుసు అనంతరం వెళుతున్నట్లు గ్రామపెద్దలు తెలియజేస్తున్నారు.

రేపటి నుంచి ఉరుసు ప్రారంభం

30న ఉరుసే షరీఫ్‌

ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement