రాయదుర్గంటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల బరిలో భార్యాభర్తలు నిలవడంతో ఈ దంపతుల పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున మాజీ కౌన్సిలర్ లుబ్న గజాల 31వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆమె భర్త గోనబావి నిజాముద్దీన్ సైతం మరో వార్డు 34 నుంచి బరిలో ఉన్నారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో లుబ్న గజాల వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌గా విజయం సాధించి కౌన్సిలర్‌గా వార్డు ప్రజలకు సేవలందించారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆమె మరోసారి ప్రజల తీర్పును కోరుతుండగా వైఎస్సార్సీపీ వార్డు ఇన్చార్జ్గా ఉన్న ఆమె భర్త నిజాముద్దీన్ 34వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఒకే కుటుంబలో ముగ్గురు కౌన్సిలర్లు..
నిజాముద్దీన్ కుటుంబానికి రాజకీయంగా ప్రత్యేకత ఉంది. ఒకే కుటుంబంలో ముగ్గురు కౌన్సిలర్లుగా సేవలందించారు. 2000–05లో నిజాముద్దీన్ తల్లి జెహరాబీ కౌన్సిలర్‌గా పనిచేయగా 2014–19లో జెహరాబీ భర్త, నిజాముద్దీన్ తండ్రి గోనబావి సర్మాస్ వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌గా గెలుపొంది సేవలందించారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఇంటి కోడలు, నిజాముద్దీన్ భార్య వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌గా గెలుపొంది ప్రజలకు సేవలందించడం విశేషం.


