● వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు
గుత్తి/గుత్తి రూరల్: అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం వెంటాడుతోంది. గుత్తిలో వైఎస్సార్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా పచ్చ కార్యకర్తలు అడ్డుకోవడమే ఇందుకు నిదర్శనం. శనివారం వైఎస్సార్సీపీ తరఫున పలువురు కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు రాగా.. మార్గ మధ్యంలోనే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుంటే.. వారిపైనా టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. అడ్డంకులను దాటుకుని ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇందులో నాలుగింటిని ఆమోదించి.. రెండింటిని తిరస్కరించారు. నామినేషన్లు ఎందుకు తిరస్కరించారో మాత్రం అధికారులు చెప్పడం లేదు.
మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
గుత్తి రూరల్: వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారన్న విషయం తెలియగానే శనివారం మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి గుంతకల్లు నుంచి గుత్తికి బయల్దేరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రజాపురం వద్దకు చేరుకుని రోడ్లపై బారికేడ్లను అడ్డుపెట్టి మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేసే స్వేచ్ఛను ఎవ్వరూ అడ్డుకోరాదని పోలీసులకు సూచించారు. అభ్యర్థులను అడ్డుకుని, దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
గుత్తి పట్టణానికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంటా నరహరితో పాటు పార్టీ నాయకులపై పోలీసులు శుక్రవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితులపై కాకుండా బాధితుడిపైనే పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. నరహరి శుక్రవారం నామినేషన్ పత్రాల కోసం మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి వస్తుండగా టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. అనుచరులపైనా దాడి చేశారు. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ ఫిర్యాదును పక్కన పెట్టి గుత్తి ఆర్ఎస్కు చెందిన టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరహరితో పాటు మరో పది మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద ఆగమేఘాలపై కేసు నమోదు చేశారు. ఇదెక్కడి న్యాయమంటూ వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పైగా గంటాపై ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకుడు అసలు గొడవ జరిగిన ప్రాంతంలోనే లేడు. అలాంటప్పుడు అతను ఇచ్చిన ఫిర్యాదును ఎలా పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.


