● విద్యార్థి సంఘాల ప్రకటన
అనంతపురం: వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ పలు విద్యార్థి, యువజన సంఘాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. శనివారం నగరంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏఐఎస్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీ, పీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆలం, పీఎస్యూ అధ్యక్షుడు మంజుల నరేంద్ర, ఏఐఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ, ఏఐఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భీమేష్, ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి పోతులయ్య, పీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతిభా భారతి, నాయకులు సాహిత్, వినోద్, దామూ మాట్లాడారు. 20 సంవత్సరాలుగా నగరంలో విద్యార్థుల సమస్యలపై, విద్యా రంగ అభివృద్ధిపై ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు రమేష్గౌడ్ అని కొనియాడారు. ఆయన గెలుపును కోరుతూ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంతో పాటు నగరంలో మౌలిక వసతుల కల్పన, డ్రెయినేజీ వ్యవస్థల పునర్నిర్మాణం, రక్షిత తాగునీరు, నగర సుందరీకరణ వంటి అంశాలపై రమేష్ గౌడ్ వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే సమర్థుడు మేయర్ పీఠాన్ని అధిరోహిస్తేనే అనంతపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. నగర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత అంతా ఐకమత్యంతో రమేష్ గౌడ్కు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


