రాప్తాడు రూరల్: ఎదురుగా వస్తున్న వాహనం లైట్ల వెలుతురు కళ్లపై పడటంతో బైకుపై వెళ్తున్న మహమ్మద్ జాఫర్ (24) అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి అనంతపురం రూరల్ మండలం కందుకూరు వద్ద చోటుచేసుకుంది. ఇటుకలపల్లి పోలీసులు తెలిపిన వివరాలు.. ధర్మవరం శాంతినగర్కు చెందిన మహమ్మద్ జాఫర్ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.వ్యక్తిగత పనిపై బైకుపై అనంతపురం వెళ్లి.. తిరిగి స్నేహితులతో కలిసి రాత్రి ధర్మవరం బయల్దేరాడు. మార్గమధ్యంలో కందుకూరు గ్రామం దాటిన తర్వాత వర్షం పడుతోంది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న వాహన లైట్ల వెలుతురు జాఫర్ కళ్లపై పడింది. దీంతో ఒక్కసారిగా బ్రేక్ వేయగా, బైకు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో జాఫర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటుకలపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. జాఫర్ వద్ద లభించిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. శనివారం ఉదయం బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


