అనంతపురం అగ్రికల్చర్: బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తక్కువ ధరకు బియ్యం అందించేందుకు రైతుబజార్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డు ఉన్న వారికి కిలో రూ.49 చొప్పున 26 కిలోల బ్యాగును రూ.1,274కు అందిస్తామని ప్రకటించారు. అయితే అవసరాలకు తగినంత నిల్వలు ఉంచడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో నగరవాసులకు బియ్యం దొరకడం గగనమైపోయింది. సరుకు లేకపోవడంతో శుక్రవారం కౌంటర్ బంద్ చేశారు. శనివారం వస్తాయని చెప్పడంతో ఉదయం ఎనిమిది గంటలకే నగరవాసులు రైతుబజార్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికి బియ్యం సరఫరా కాలేదు. ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎండలో నిల్చోలేక ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, సంచులు క్యూలో పెట్టి.. చెట్ల కింద పడిగాపులు కాశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బియ్యం రావడంతో విక్రయాలు ప్రారంభించారు.
రేపు ‘పరిష్కార వేదిక’ రద్దు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లో ఈ నెల 19న నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహర్నవమి, దుర్గాష్టమి, విజయదశమి సందర్భంగా ప్రభుత్వ సెలవుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ‘పరిష్కార వేదిక’ రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వెంకటలక్ష్మి
గుంతకల్లుటౌన్: గుంతకల్లు మున్సిపల్ చైర్పర్సన్ పీఠానికి మరోసారి బీసీ – వాల్మీకి సామాజిక వర్గానికి వైఎస్సార్సీపీ అవకాశం కల్పించింది. చైర్పర్సన్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే గాదిలింగప్ప సతీమణి ఎన్.వెంకటలక్ష్మి పేరును పార్టీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈమె గతంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


