ఉరవకొండ: స్థానిక షిరిడీ సాయి కల్యాణమంటపంలో నిస్వార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్టీల్‌ప్లేట్లు, గ్యాస్‌ల బ్యాంకు శుక్రవారం ప్రారంభించారు. నిస్వార్థ ఫౌండేషన్ ప్రతినిధి వెంకట్ తాడికొండ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వివాహాది శుభకార్యాలు, ఫంక్షన్లలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్‌ల వినియోగం పెరిగిపోయిందన్నారు. దీంతో కేన్సర్ ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నా మార్పు రావడంలేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని దాతల సహకారంతో స్టీల్ ప్లేట్లు, గ్లాస్‌లు ఫంక్షన్లకు ఉచితంగా అందిస్తామన్నారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
బుక్కరాయసముద్రం: మండలంలోని వీరభద్ర కాలనీలో కుటుంబ కలహాలతో వీరేష్ (48) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. వీరభద్ర కాలనీలో నివాసం ఉంటున్న వీరేష్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరేష్‌కు కుటుంబ కలహాలుండేవి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్‌రూంలో ఊరేసుకొని ఆత్యహత్యాయత్నం చేశా డు. వెంటనే కుటుంబ సభ్యలు గుర్తించి 108 వాహనంలోఅనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
‘అనంత’కు హార్టికల్చర్
హబ్ వరం
అనంతపురం అగ్రికల్చర్: పది జిల్లాలతో కూడిన రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటయితే జిల్లా రైతులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, కలెక్టర్ ఆనంద్ తదితరులు తెలిపారు. శుక్రవారం మదనపల్లిలో సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు హాజరై గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానికంగా రెవెన్యూ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్లోబల్‌హబ్‌కు మూడేళ్ల కాలంలో రూ.లక్ష కోట్ల మేర వెచ్చిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచ పటంలో అనంతపురం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. జిల్లాలో అటు నీటిపారుదల, పంచాయతీరాజ్, ఉద్యానశాఖ పరిధిలో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మున్ముందు అభివృద్ధిలో ‘అనంత’ రూపురేఖలు మారబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ డీడీ బీసీ ధనుంజయ, జేడీఏ ఎన్.సాలురెడ్డి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘అనంత’ ఇంజినీర్లకు స్వచ్ఛాంధ్ర అవార్డులు
అనంతపురం న్యూ టౌన్: అనంత ఇంజినీర్లకు స్వచ్ఛాంధ్ర రాష్ట్ర అవార్డులు దక్కాయి. గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య విభాగం తాడిపత్రి డివిజన్ ఇంజినీర్లు ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026 ప్రదానం చేశారు. జిల్లాకు సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్ తాడిపత్రి డివిజన్ డీఈ సి. రామ్‌గోపాల్ రెడ్డి, యాడికి మండలం అసిస్టెంట్ ఇంజినీర్ పి. దేవకుమార్ సీఎం చంద్రబాబునాయుడు చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. డీఈ రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ యాడికి మండలం తిమ్మాపురంలో ప్రజలను చైతన్యపరిచి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని వంద శాతం అమలు చేశామన్నారు. కేవలం రూ.3 లక్షల 60 వేల స్వచ్ఛభారత్ గ్రాంట్‌తో డ్రైనేజీ కమ్యూనిటీ షాక్ ఫిట్ ఏర్పాటుతో తిమ్మాపురం గ్రామంలో రోడ్లపై మురుగునీరు పారకుండా చేసినట్లు తెలిపారు. తమ డివిజన్ పరిధిలోని పెద్దవడుగూరు మండలంలోని లక్షుంపల్లి, తాడిపత్రి మండలంలోని పెద్ద పోలమడ తదితర గ్రామాల్లో స్వచ్ఛభారత్ గ్రాండ్‌తో పల్లె సీమల పరిసరాల పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టామన్నారు.


