●దివ్యాంగుడి ఆత్మ
హత్యాయత్నం
వీడియో వైరల్
బెళుగుప్ప: మండలంలోని బెళుగుప్ప తండాకు చెందిన దివ్యాంగుడు పాండునాయక్ పురుగు మందు డబ్బా తీసుకొని ఆత్మాహత్యాయత్నం చేసిన వీడియో శుక్రవారం వైరల్ అయ్యింది. వివరాలు.. తండాకు చెందిన దివ్యాంగుడు పాండునాయక్.. తన సోదరులు, వారి కుమారులు తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోకుండా అడ్డుపడుతున్నారు. ఈవిషయంపై మండల అధికారులు, జిల్లా ఎస్పీ జగదీష్‌కు సైతం ఫిర్యాదు చేశాడు. అయినా న్యాయం జరగలేదని పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యా యత్నం చేసిన వీడియో గురువారం రాత్రి నుంచి వైరల్ అయ్యింది. రెండు కాళ్లూ వంకరతో మూడు చక్రాల బండికి పరిమితం అయిన దివ్యాంగుడిని సోదరులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తన భార్య, కూతురును సైతం చితకబాదారని, టీడీపీలో కార్యకర్తగా పనిచేసినా కనీసం ఆ పార్టీ నాయకులు సైతం న్యాయం చేయలేదని, ఇక తనకు చావే శరణ్యమని పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకొని విలపిస్తూ వీడియో వైరల్ చేశాడు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నాడు. పురుగు మందు తాగుతుండగా, భార్య వనితాబాయి, కూతురు శిరీషాబాయి అడ్డుకున్నారు. విషయంపై వీడియో శుక్రవారం వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సాయంత్రం ఘటనపై పాండునాయక్ కుటుంబాన్ని స్టేషన్‌కు పిలిపించి సీఐ ఈరన్న, బెళుగుప్ప ఎస్‌ఐ శివ విచారణ చేపట్టారు.


