రాప్తాడు రూరల్: ‘అన్నా.. ఇంటికొస్తున్నా.. అని ఫోన్‌లో సోదరుడికి చెప్పి.. టీ కేఫ్ నుంచి బైక్‌పై బయల్దేరాడు... నెమ్మదిగా యూటర్న్ దాటుతున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొ నింది. దీంతో గాలిలో ఎగిరిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చీకటిపడిన తర్వాత అనంతపురం నగర శివారు బళ్లారిరోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు..ఉరవకొండ మండలం చాబాలకు చెందిన జయన్న (45) అనంతపురం బళ్లారిరోడ్డు శ్రీకృష్ణనగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. జయన్న ఉరవకొండలో సప్లయర్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఉరవకొండ మండలం ఆమిద్యాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఇంటికి వస్తున్నా అన్నా...
సాయంత్రం బళ్లారిరోడ్డులోని సిండికేట్‌నగర్ నుంచి అనంతపురం వైపు వెళ్లే మార్గంలోని ‘టీబ్రేక్’ కేఫ్‌కు జయన్న వెళ్లాడు. అక్కడ సుమారు గంటన్నరపాటు గడిపాడు. కాఫీ తాగుతూ పలువురితో ఫోన్‌లో మాట్లాడాడు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు బైకు తీశాడు. అదే సమయంలో తన సోదరుడు ఓబులేసుకు ఫోన్ చేశాడు. ‘ఎక్కడున్నావు అన్నా?’ అని ఓబులేసును అడిగాడు. పనిమీద కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్నానని, తాను ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తున్నాను..అక్కడ కలుద్దామని జయన్న చెప్పాడు. ఆ ఫోన్ సంభాషణ ముగిసిన ఐదు నిమిషాలకే ప్రమాదం చోటుచేసుకుంది.
నెమ్మదిగా దాటుతుండగా..
శ్రీకృష్ణనగర్‌లోని ఇంటికి వెళ్లేందుకు యూటర్న్ వద్ద జయన్న బైకుపై నెమ్మదిగా అనంతపురం నుంచి సిండికేట్‌నగర్ వైపు వెళ్లే మార్గంలోకి చేరుకుంటుండగా అనంతపురం వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు జయన్న గాలిలో ఎగిరి పదుల అడుగుల దూరంలో రోడ్డుపై పడ్డాడు. బైకు సైతం గాలిలో పల్టీలు కొడుతూ అవతలి వైపున పడిపోయింది. ఘటనాస్థలం బీభత్సంగా మారింది. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, సోదరుడు బోరున విలపించారు.
ప్రమాదానికి కారణమైన
వాహనం గుర్తింపు..
అనంతపురం రూరల్ పోలీసులు ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనాన్ని జిల్లా సరిహద్దులోని విడపనకల్లు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని సిరుగుప్ప ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించారు. సీఐ శ్రీకాంత్‌యాదవ్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక చొరవ చూపి ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే వాహనాన్ని పట్టుకున్నారు.
స్పీడు బ్రేకర్లున్నా.. సూచికలు లేవు
ఈ యూటర్న్ వద్ద స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని సూచించే హెచ్చరిక బోర్డులు, గుర్తులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. కొత్తగా వచ్చే వాహనదారులకు స్పీడు బ్రేకర్లు ఉన్న విషయం తెలియకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే యూటర్న్ వద్ద ఇటీవల కాలంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీకాంత్‌యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
సోదరుడికి ఫోన్ చేసిన ఐదు నిమిషాలకే అనంత లోకాలకు..
రోడ్డుదాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా వాహనం
వాహనం ధాటికి గాలిలో ఎగిరి పడిన జయన్న


