యాడికి: ‘ అయ్యా.. నన్ను దివాలా వ్యక్తిగా ప్రకటించండి’ అంటూ మండలానికి చెందిన మాయకుంట్ల మోహన్ గుత్తి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును శుక్రవారం ఆశ్రయించాడు. వివరాలు.. మొత్తం 56 మంది రుణ దాతలకు సుమారు రూ.1.65 కోట్ల మేర అప్పు ఉన్నట్లు ఐపీ 31/2006 నంబర్‌తో దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నాడు. తన వద్ద చరాస్తులేమీ లేవని, సుమారు రూ.10 లక్షల విలువైన భూములు మాత్రమే ఉన్నాయని పిటీషన్‌లో పేర్కొన్నాడు. విచారణలో భాగంగా 30వ ప్రతి వాది అయిన యాడికి అంత్రాల వీధికి చెందిన తెల్లాకుల రమేష్‌తో పాటు ఇతర రుణదాతలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రొవిన్షియల్ యాక్ట్ సెక్షన్ 19(2) కింద కోర్టు ఈ వ్యవహారంపై విచారణ చేపడుతోంది.
రెజ్లింగ్, బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ
ధర్మవరం అర్బన్: అనంతపురంలో గురువారం జరిగిన 70వ ఎస్‌జీఎఫ్ స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి రెజ్లింగ్, బాక్సింగ్ పోటీల్లో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చూ పారని హెచ్‌ఎం సుమన, పీడీ స్వరూప, కోచ్ ఇనాయత్ బాషా తెలిపారు. శుక్రవారం పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారిణులను వారు అభినందించారు. వారు మాట్లాడుతూ అనంతపురంలో జరిగిన రెజ్లింగ్ అండర్–14 మైనస్ 33 కేజీ విభాగంలో సింధు, మైనస్ 50 కేజీల విభాగంలో ప్రణవి, అండర్–17 మైనస్ 48 కేజీల విభాగంలో డమరీశ్వరి ప్రతిభ చూపారన్నారు. ఈనెల 11 నుంచి 14 వరకు పల్నాడు జిల్లాలో జరగబోవు రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు అండర్–19 మైనస్ 50 కేజీల విభాగంలో ప్రణిత, వర్షిని ఎంపికయ్యారన్నారు. ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని చైత్ర బాక్సింగ్, రెజ్లింగ్ రెండు విభాగాల్లోనూ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయినట్లు తెలిపారు. ప్రియదర్శిని స్కూల్ విద్యార్థి శశాంక్‌కుమార్ బాక్సింగ్, ఊషూ క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. వాసవీ కాలేజీ ఇంటర్ విద్యార్థి ఉదయ్ అండర్–17 బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయినట్లు తెలిపారు.
మతిస్థిమితంలేని మహిళకు గాయాలు
చెన్నేకొత్తపల్లి(కనగానపల్లి): చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్‌గేట్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం మతిస్థిమితంలేని మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు ఒక కాలు విరిగింది. స్థానికులు తెలిపిన మేరకు..మతిస్థిమితం లేని మహిళ చుట్టు పక్కల గ్రామాల్లో తిరుగుతుంటుంది. జాతీయ రహదారి పక్కన నడిచి వెళ్తున్న ఆమెను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. స్థానికులు గుర్తించి ఆమె చెన్నేకొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కాగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించటానికి ఆమెకు ఎవరూ తోడు లేకపోవటంతో అక్కడే ఉంచినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.


