బత్తలపల్లి: మండల పరిధిలోని వెంకటగారిపల్లి సత్రం వద్ద వెలసిన పురాతన దుర్గమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆలయ పూజారి డేరంగుల రాజా చిన్నాన్న గంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు ధరించి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయ తలుపులను మిషన్ ద్వారా తొలగించారు. అనంతరం ఆలయం లోపలికి వెళ్లి మిషన్ ద్వారానే హుండీ తలుపులు తెరిచి అందులో ఉన్న దాదాపు రూ.15 వేల నగదు, 10 తులాల వెండి గొడుగుతో పాటు మరో ఏడు చిన్న గొడుగులను (దాదాపు 25 నుంచి 30 తులాల వరకు) ఎత్తుకెళ్లిపోయారు. ఆలయ పూజారి రాజా తిరుపతికి వెళ్లడంతో ఆయన చిన్నాన్న గంగయ్య ఆలయం వద్దకు పూజలు నిర్వహించేందుకు వెళ్లాడు. అక్కడ ఆలయ తలుపులు కోసి ఉండడంతో అనుమానం వచ్చి గ్రామస్తులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరా ఉండగా అందులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ఎలా పాల్పడింది నమోదైంది. ముగ్గురు వ్యక్తులు రాగా ఇద్దరు బయట కాపలాగా ఉన్నట్లు తెలిసింది.


