‘ఉత్తమ అధికారి’ లంచావతారం | - | Sakshi
Sakshi News home page

‘ఉత్తమ అధికారి’ లంచావతారం

Sep 1 2026 3:24 AM | Updated on Sep 1 2026 3:24 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: జనవరి 26న గణతంత్ర వేడుకల్లో ఉత్తమ అధికారిగా అవార్డు స్వీకరించిన పంచాయతీ కార్యదర్శి... కొద్ది నెలలకే అవినీతి ఆరోపణలతో ఏసీబీ విచారణను ఎదుర్కోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంటి నిర్మాణానికి ప్లాన్‌ అప్రూవల్‌ కోసం లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో అనంతపురం రూరల్‌ రుద్రంపేట పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లాను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బోయ నాగేంద్రకు అనంతపురం రూరల్‌ కక్కలపల్లి సర్వే నంబర్‌ 122/3బీలో నాలుగు సెంట్ల స్థలం ఉంది. ప్లాట్‌ నంబర్‌ 21లో ఇల్లు నిర్మించుకునేందుకు ప్లాన్‌ అప్రూవల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్రూవల్‌ చేయాలంటే రూ.10 వేలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లా డిమాండ్‌ చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని నాగేంద్ర చెప్పడంతో రూ.8 వేలకు అంగీకరించారు. అయితే.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు హిదయతుల్లాను పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు.

‘సారు’ చెప్పడంతో..

కక్కలపల్లి కాలనీ సచివాలయంలో శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న కంబగిరి అలియాస్‌ గిరి సోమవారం కళ్యాణదుర్గం రోడ్డు కూడలిలోని అంజనా కేఫ్‌ వద్ద నాగేంద్ర నుంచి రూ.8 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తాను పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లా సూచనల మేరకే నాగేంద్ర నుంచి డబ్బులు తీసుకున్నట్లు కంబగిరి ఏసీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా కంబగిరి, పంచాయతీ కార్యదర్శి మధ్య జరిగిన ఆడియో కాల్‌ సంభాషణను ఏసీబీ అధికారులు సేకరించినట్లు తెలిసింది.

అదుపులోకి హిదయతుల్లా

అనంతరం ఏసీబీ అధికారులు రుద్రంపేట పంచాయతీ కార్యాలయానికి చేరుకుని పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లాను అదుపులోకి తీసుకుని విచారించారు. ఎంపీడీఓ దివాకర్‌ను అక్కడికి పిలిపించి కంబగిరి ఉద్యోగ వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటి అప్రూవల్‌ కోసం పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచితంగా చేయాల్సిన పనులకు ఎవరైనా అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని సూచించారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే ఏసీబీ డీఎస్పీల 94404 46181, 94404 48182 నంబర్లకు, ఇతర సీఐలనంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

ప్లాన్‌ అప్రూవల్‌కు రూ.10 వేల లంచం డిమాండ్‌

ఏసీబీ వలలో రుద్రంపేట పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లా

రూ.8 వేలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ శానిటరీ వర్కర్‌

‘సారు’ చెప్పడంతో డబ్బులు తీసుకున్నానని ఏసీబీ ముందు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement