24 గంటల్లో డిగ్రీ ఇన్‌స్టంట్‌ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

24 గంటల్లో డిగ్రీ ఇన్‌స్టంట్‌ ఫలితాలు విడుదల

Sep 1 2026 3:24 AM | Updated on Sep 1 2026 3:24 AM

అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలో ఆగస్టు 30న డిగ్రీ ఐదవ సెమిస్టర్‌ ఇన్‌స్టంట్‌ పరీక్ష నిర్వహించారు. జవాబు పత్రాలను వేగవంతంగా మూల్యాంకనం చేసి 24 గంటల్లోనే ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా, వారి భవిష్యత్తు విద్యా అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత వేగంగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ జ్యోతికుమార్‌ తెలిపారు. పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్‌ ప్రొఫెసర్‌ లక్ష్మయ్య సమర్థవంతంగా పర్యవేక్షించారని ప్రశంసించారు. ఇన్‌స్టంట్‌ పరీక్షలకు మొత్తం 231 మంది విద్యార్థులు హాజరు కాగా, 228 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

శ్రావణమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం

బొమ్మనహాళ్‌: నేమకల్లు ఆంజనేయస్వామి బాలాలయంలో శ్రావణమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు సోమవారం ధ్వజ పట ఆరాధన వైభవంగా నిర్వహించారు. అర్చకులు అనిల్‌కుమార్‌స్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు.

రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖకు

ఐదు గవర్నర్‌ మెడల్స్‌

అనంతపురం సిటీ: విశిష్ట సేవలు అందించినందుకు గాను ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖకు ఐదు ప్రతిష్టాత్మక గవర్నర్‌ అవార్డులు దక్కాయి. వీటిలో మెంబర్‌షిప్‌ కేటగిరిలో రెండు మెడల్స్‌, సామాజిక సేవ, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కేటగిరిలో మరో మూడు మెడల్స్‌ ఉన్నాయి. మెంబర్‌షిప్‌ కేటగిరీలో గత ఏడాది మే 15న గవర్నర్‌ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అప్పటి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అందుకున్న విషయం తెలిసిందే. కాగా, రెండో మెడల్‌ను మంగళవారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఏపీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో వాకా శ్రీనివాసులరెడ్డి గవర్నర్‌ చేతుల మీదుగా అందుకోనున్నారు. అలాగే బ్లడ్‌ బ్యాంక్‌కు సుమారు రూ.70 లక్షల విలువైన పరికరాలను అందజేసిన మోబిస్‌ ఇండియా మాడ్యూల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సీఎస్‌ఆర్‌ కేటగిరీలో మెడల్‌ దక్కింది. ఈ మెడల్‌ను మోబిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ యాంగ్‌యోంగ్‌డ్యూక్‌ అందుకోనున్నారు. మరో మెడల్‌ రెడ్‌క్రాస్‌కు రూ.55 లక్షల విలువైన సహకారం అందించిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు దక్కింది. ఈ అవార్డును ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దోమన్‌ యాదవ్‌ అందుకోనున్నారు. మూడో మెడల్‌ సప్తగిరి క్యాంఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు దక్కింది. అవార్డులకు ఎంపికై న వారిని కలెక్టర్‌ ఆనంద్‌ అభినందించారు.

నేడు ఐఏబీ సమావేశం

హడావుడిగా ఖరారు చేసిన అధికారులు

అనంతపురం సెంట్రల్‌: సాగునీటి సలహామండలి (ఐఏబీ) సమావేశం మంగళవారం అనంతపురంలో నిర్వహించనున్నారు. హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాతో పాటు ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌ కింద కర్నూలు జిల్లా రైతులు, పులివెందుల, మైలవరం బ్రాంచ్‌కెనాల్స్‌ కింద వైఎస్సార్‌ కడప జిల్లాల రైతులు ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు కూడా హాజరుకావాల్సి ఉంది. గతంలో వారం రోజుల క్రితమే ఐఏబీ సమావేశం తేదీ ఖరారు చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ రాత్రికి రాత్రి సమావేశాల తేదీలను ఖరారు చేసేస్తున్నారు. ఇటు హెచ్చెల్సీ.. అటు హంద్రీ–నీవా ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటి వినియోగంపై రైతులకు ఉపయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఐఏబీ సమావేశం అత్యంత కీలకం. అలాంటి సమావేశాన్ని అధికారులు హడావుడిగా నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా హెచ్చెల్సీ ద్వారా దాదాపు 20 టీఎంసీలకు పైగా నీరు వచ్చే అవకాశముంది. అయితే గత బోర్డు సమావేశంలో అప్పటి అంచనాల మేరకు 16 టీఎంసీలు కేటాయించారు. దీంతో సాగుకు నీటిని విడుదల చేయడానికి ఆస్కారం లేదంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం దాదాపు 100 టీఎంసీల సామర్థ్యంతో తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీకి కేటాయింపులు పెరగనున్నాయి. అయినప్పటికీ సాగునీటికి నీటిని విడదుల చేయకూడదనే భావనతో పాటు తుంగభద్ర హై లెవల్‌ మెయిన్‌ కెనాల్‌ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ ఆయకట్టు రైతులకు మాత్రమే మేలు చేకూర్చేందుకు.. దిగువన ఉన్న ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయలేమని చెప్పే విధంగా ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రణాళికలు రచిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేటి సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement