● హంద్రీ–నీవా నీటి కోసం రోడ్డు దిగ్బంధం
వజ్రకరూరు: హంద్రీ–నీవా నీళ్లు వస్తాయనే నమ్మకంతో పంట పెడితే.. సాగుకు వాడుకోరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై అన్నదాతలు ఆగ్రహించారు. ఒకవైపు వర్షాలు లేవు... మరోవైపు కళ్లముందు కాలువగుండా నీరు వెళ్తున్నా వాడుకునే అవకాశం లేకపోతే తాము ఎలా బతకాలి అంటూ ప్రశ్నించారు. రామగిరి చెరువు, వెంకటాంపల్లి, జరుట్లరాంపురం తదితర చెరువులను నింపడంతోపాటు పంటలకు నీటిని విడుదల చేయాలని వజ్రకరూరు మండలం గంజికుంట, తట్రకల్లు, పందికుంట, వెంకటాంపల్లి, జరుట్ల రాంపురం, వజ్రకరూరు, పామిడి మండలం ఎద్దులపల్లి, రామగిరి తదితర గ్రామాలకు చెందిన వందలాదిమంది రైతులు ఉద్యమించారు. సోమవారం రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా ప్రధాన కాలువ వద్దకు చేరుకుని ఉరవకొండ – గుంతకల్లు రోడ్డును దిగ్బంధించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాలువలో సమృద్ధిగా నీరు వెళ్తున్నా వాడుకోవద్దంటే తాము పంటలపై ఆశలు వదులుకుని, అప్పులపాలు కావాల్సి వస్తుందన్నారు. గ్రామాల్లో బోర్లల్లో నీటిమట్టం పడిపోయిందని, చెరువులు, కుంటలు ఎండిపోయాయని, తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిందన్నారు. చెరువులకు నీటిని విడుదల చేసేంత వరకు కదిలేది లేదని భీష్మించారు. మూడున్నర గంటలపాటు ఆందోళన కొనసాగడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సీఐ మహానంది, వజ్రకరూరు తహసిల్దార్ జయశ్రీ, ఎస్‌ఐ నాగస్వామి సిబ్బందితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. హంద్రీ–నీవా అధికారులు వచ్చి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి నుంచి ఆదేశాలు వస్తే చెరువులకు నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు.


