ఉరవకొండ: సాగునీటి పోరు ఉధృతరూపం దాల్చింది. నీళ్లున్నా ఆయకట్టుకు వదలకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంపై రైతులు ఆగ్రహించారు. వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కదం తొక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం ఉరవకొండ మండలం చిన్నముస్టూరు సమీపంలోని హంద్రీ–నీవా కాలువ పక్కన అనంతపురం – బళ్లారి 42వ జాతీయ రహదారిని దగ్బంధించారు. నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ఆందోళనను అడ్డుకునేందుకు చిన్నముస్టూరు, ఇంద్రావతి, రాయంపల్లి, పాల్తూరుతో పాటు అన్ని గ్రామాల్లోనూ పోలీసులు భారీగా మోహరించి, కేసులు నమోదు చేస్తామంటూ బెదిరించారు. అయినా పోలీసుల ఆంక్షలు.. అడ్డంకులను దాటుకుని రైతులు పొలాల గుండా హైవేకు చేరుకున్నారు. కొందరు రైతులు పురుగుమందు డబ్బాలు చేతపట్టి తమ దుస్థితిని చాటారు. హెచ్చెల్సీ, హంద్రీ–నీవా, జీబీసీ పరిధిలోని ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినదించారు. పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోతే పరిస్థితి ఏమిటి.. అప్పులు చేసి సాగు చేసిన రైతులను ఎవరు ఆదుకుంటారు అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆందోళన కొనసాగింది. హైవేపైనే రైతులంతా సహపంక్తి భోజనాలు చేశారు.
ఎవరిని అడిగి నిర్ణయించారు?
‘హెచ్చెల్సీ, హంద్రీ–నీవా కింద ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేమని జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇది మీ సొంత నిర్ణయమా లేక శాసనసభలో కానీ, రాజ్యసభలో కానీ ఏమైనా చర్చించారా.. సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనే లేదు. మరి ఎవరిని అడిగి నిర్ణయించారు’ అని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నా ఇప్పటివరకూ ఐఏబీ సమావేశం నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా అయితే రైతులు పంటలు పెట్టుకోలేక.. ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు వంద మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా హెచ్చెల్సీ, హంద్రీ–నీవా, జీబీసీ కింద కనీసం తరుతడి పంటలకై నా నీళ్లు ఎప్పడిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీలోపు సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వకపోతే ఆయకట్టు రైతులతో కలిసి జీబీసీ, హెచ్చెల్సీ షట్టర్లు ఎత్తి పొలాలకు నీటిని మళ్లిస్తామని హెచ్చరించారు.
ఆయకట్టుకు నీటి కేటాయింపులు లేక పంటలు సాగు చేసుకోలేని దుస్థితిలో రైతులు ఉన్నా మంత్రి పయ్యావుల కేశవ్‌కు కనిపించడం లేదని విశ్వ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను పొగుడుతూ మెప్పు పొందేందుకు ప్రయత్నించడం కాదు.. జిల్లా రైతుల అవస్థలను వివరించి.. హంద్రీ–నీవా, హెచ్చెల్సీ, జీబీసీలకు సాగునీరు విడుదలయ్యేలా చూడాలని సూచించారు. సొంత నియోజకవర్గంలో రైతులు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో చూసి సిగ్గుపడాలని తెలిపారు. కరువు పీడిత అనంతపురం జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవాను ప్రారంభించారని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని సీఎం స్వార్థ ప్రయోజనాల కోసం తన సొంత నియోజకవర్గం కుప్పానికి తీసుకెళ్తుంటే.. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, అధికార ప్రతినిధి సీపీ వీరన్న, రాష్ట్ర నాయకులు హావళిగి భరత్‌రెడ్డి, యోగేంద్రరెడ్డి, కరణం భీమిరెడ్డి, జల్లిపల్లి దేవేంద్ర, డొనేకల్లు కురుబ రమేష్, ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మోపిడి సిద్దార్థ్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, మండల కన్వీనర్లు సోమశేఖర్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, రైతు విభాగం నాయకులు జయచంద్రారెడ్డి, డిష్ సురేష్, ఉస్మాన్, విద్యార్థి విబాగం నాయకులు నవీన్‌రెడ్డి, కౌడిగి గోవిందు, జోగి వెంకటేష్, విడపనకల్లు సుంకన్న, డిష్ వెంకటేష్, భూమారెడ్డి, నరిగన్న తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కిన కర్షక లోకం
42వ జాతీయ రహదారి 3 గంటలపాటు దిగ్బంధం
పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపిన రైతులు
సాగునీరివ్వకపోతే షట్టర్లు ఎత్తి పొలాలకు మళ్లిస్తామన్న వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ


