తిరిగి తిరిగి.. విసిగి వేసారి... | - | Sakshi
Sakshi News home page

తిరిగి తిరిగి.. విసిగి వేసారి...

Aug 29 2026 1:16 AM | Updated on Aug 29 2026 1:16 AM

రెండు నెలలైనా పలువురికి అందని ‘సుఖీభవ–పీఎం కిసాన్‌’

అనంతపురం అగ్రికల్చర్‌: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌ కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందడం లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించినట్లుగా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇవ్వకుండా రూ.14 వేలకు పరిమితం చేశారు. ఇలా మొదటి ఏడాది సుఖీభవ కింద రూ.400 కోట్లకు పైగా రైతులకు ఇవ్వకుండా మోసం చేసిన విషయం తెలిసిందే. రెండో ఏడాది మొదలు పెట్టినా జాబితాకు వివిధ రూపాల్లో కొర్రీలు వేయడంతో వేలాది మందికి పెట్టుబడి సాయం అందకుండా పోతోంది.

జాబితాకు కొర్రీలు..

పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తామన్న హామీతో రైతుల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం మొదటి ఏడాది పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. చివరకు రూ.14 వేలు ఖరారు చేసి రెండో ఏడాది మొదలు పెట్టినా రైతుల సంఖ్య పెరగాల్సి ఉన్నా తగ్గించడం గమనార్హం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2.85 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్‌ ఇస్తుండగా నేడు 30 వేల మందికి కొర్రీలు వేసి 2.55 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. రైతు భరోసా కింద గత ప్రభుత్వం 2.94 లక్షల మంది వరకు ఇవ్వగా నేడు 20 వేల మందికి రిక్తహస్తం చూపి 2.75 లక్షల మంది రైతులకు మాత్రమే ఇస్తున్నారు. ఇలా 25 వేల మందికి పైగా పెట్టుబడి సాయం అందించకుండా మొండిచేయి చూపిస్తున్న దుస్థితి నెలకొంది. పేరుకు మాత్రం సాయం పెంచినట్లు చెబుతున్నా మొదటి ఏడాది ఎగ్గొట్టడం, జాబితాలో రైతుల పేర్లు తొలగించడం చూస్తే చంద్రబాబు ప్రభుత్వానికి రైతులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఈకేవైసీ లేదని, ఎన్‌పీసీఐ యాక్టివ్‌ లేదని, మ్యాపింగ్‌ చేయలేదంటూ వేలాది మంది రైతులు సుఖీభవ–పీఎం కిసాన్‌ సొమ్ము కొందరు రైతులకు జమకాని పరిస్థితి నెలకొంది.

గతంలో క్యాలెండర్‌ ప్రకారం జమ..

గతంలో 2019–2024 మధ్య కాలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం క్రమం తప్పకుండా క్యాలెండర్‌ ప్రకారం మూడు విడతల్లో భరోసా కింద పెట్టుబడి సాయం అందించింది. కరోనా మహమ్మారితో 2020, 2021లో అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా రూ.13,500 ప్రకారం ఏకంగా 2.90 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.390 కోట్ల వరకు సాయం అందించారు. అలా ఐదేళ్ల కాలంలో భరోసా–పీఎం కిసాన్‌ కింద ఒక్కో రైతుకు రూ.67,500 ప్రకారం జిల్లా రైతులకు రూ.1,937 కోట్లు మేర భారీ ఎత్తున పెట్టుబడి సాయం జమ చేయడం గమనార్హం.

2026–27కు సంబంధించి మొదటి విడతగా రూ.5 వేలు, పీఎం కిసాన్‌ కింద 23వ విడతగా రూ.2 వేల ప్రకారం గత జూన్‌ 20న రూ.188.67 కోట్ల సొమ్ము విడుదల చేశారు. అయితే, రెండు నెలలు దాటినా పలువురు రైతులకు నగదు జమకాని పరిస్థితి నెలకొంది. రోజూ పదుల సంఖ్యలో రైతులు అనంతపురం జేడీఏ కార్యాలయానికి వస్తుండగా, మరికొందరు ప్రతి సోమవారం కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు, ఇంకొందరు రైతులు ఆర్‌ఎస్‌కేలు, మండల వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్న పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement