● విచారణ అధికారుల ఎదుట శింగనమల కేజీబీవీ విద్యార్థిని తల్లిదండ్రుల ఆవేదన
అనంతపురం ఎడ్యుకేషన్: ‘మా పాపకు ఆరోగ్యం బాగలేదని చెప్పినా కేజీబీవీ ఎస్‌ఓ, సిబ్బంది పట్టించుకోలేదు. మా పాప చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారు?’ అంటూ శింగనమల కేజీబీవీ ఆరో తరగతి విద్యార్థిని ప్రియదర్శిని తల్లిదండ్రులు విచారణ అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ప్రియదర్శినిని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి శుక్రవారానికి మూడు రోజులు పూర్తయింది. ఆరోగ్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటే వైద్యులు ఇన్ని రోజులుగా ఆస్పత్రిలోనే ఉంచుతారో అర్థం చేసుకోవచ్చని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా కేజీబీవీ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. మరో విద్యార్థిని ద్వారా సమాచారం అందుకున్న తండ్రి రామాంజనేయులు ఈ నెల 25న సాయంత్రం కేజీబీవీకి వెళ్లారు. అయితే కుమార్తెను కనీసం చూపించకుండా ‘మీపాప యాక్షన్ చేస్తోంది.. ఏమీ కాలేదుపో’ అంటూ గద్దించి పంపినట్లు తెలిపారు. దీంతో మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రులు లక్ష్మీ, రామాంజనేయులు ఇద్దరూ కేజీబీవీకి వెళ్లి ఎస్‌ఓ, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరకు తమ కుమార్తెను బలవంతంగా బయటకు తీసుకొచ్చి అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
‘సాక్షి’ కథనంతో కదిలిన అధికారులు
శింగనమల ఘటనపై ‘కేజీబీవీల్లో భద్రత గాలికి’ అనే శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. కేజీబీవీ యాజమాన్య నిర్లక్ష్యంతో విద్యార్థిని ప్రాణాల మీదకు వచ్చిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనంపై సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు స్పందించి విచారణకు ఆదేశించారు. కేజీబీవీ సెక్రటరీ దేవానందరెడ్డి కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, శింగనమల ఎంఈఓ నరసింహరాజు కేజీబీవీకి వెళ్లారు. ఎస్‌ఓ, సిబ్బందితో సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు సేకరించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులను మాత్రం సాయంత్రం వరకు కలవలేదు. విచారణలో భాగంగా ముందుగా బాధితురాలి వద్దకు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి, జరిగిన పరిణామాలపై తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు సాయంత్రం చీకటి పడిన తర్వాత సమగ్రశిక్ష, విద్యాశాఖ అధికారులు నగరంలోని ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రియదర్శినితో పాటు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
అక్కను కూడా కలవనీయలేదు!
ప్రియదర్శిని అక్క మాధవి అదే కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. చెల్లెలు ఆస్పత్రిలో చేరిందన్న విషయం తెలిసి ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతోంది. కనీసం ఒక్కసారి ఫోన్‌లో చెల్లెలితో మాట్లాడించాలని కేజీబీవీ ఎస్‌ఓ, సిబ్బందిని ప్రాధేయపడినా పట్టించుకోలేదని ఆరోపించారు. సిబ్బంది కనీస మానవత్వం కూడా చూపకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోందని తల్లిదండ్రులు మండిపడ్డారు.


