నీట్‌–పీజీకి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నీట్‌–పీజీకి పకడ్బందీ ఏర్పాట్లు

Aug 29 2026 1:16 AM | Updated on Aug 29 2026 1:16 AM

అనంతపురం అర్బన్‌: ఈ నెల 30న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)– పీజీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో మలోల అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై డీఆర్‌ఓ శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పరిపాలనాధికారి అలెగ్జాండర్‌తో కలిసి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 979 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులను ఉదయం 7 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

గుంతకల్లు రూరల్‌: కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన జోలాపురం గోవిందరాజులు (45) శుక్రవారం కసాపురంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. గోవిందరాజులు శుక్రవారం ఉదయం గుత్తిలో పెళ్లి వేడుకలు ముగించుకున్న తర్వాత కసాపురం చేరుకున్నాడు. అక్కడ తనకు పరిచయం ఉన్న మరో మహిళతో కలిసి నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం సమీపంలోని ఓ ప్రైవేటు అద్దెగదికి వెళ్లాడు. సాయంత్రం వేళ గోవిందరాజులు బాత్‌రూములో కాలుజారి పడిపోయాడంటూ వెంట వచ్చిన మహిళ గది నిర్వాహకులకు తెలిపారు. వెంటనే వారు అంబులెన్స్‌లో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. గోవిందరాజులు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కసాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐదు పాఠశాలలకు స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌ అవార్డులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని పాఠశాల స్థాయిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ 2025–26కు జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేసినట్లు డీఈఓ డాక్టర్‌ అయూబ్‌ హుస్సేన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న కంబదూరు మండలం నూతిమడుగు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తాడిపత్రి తలారి చెరువు పెన్నా ఇంగ్లిష్‌ మీడియం ఉన్నత పాఠశాల, వజ్రకరూరు మండలం కొనకొండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఉరవకొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (సెంట్రల్‌), విడపనకల్లు మండలం పాల్తూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు కలెక్టర్‌ చేతుల మీదుగా శనివారం ఉదయం 10 గంటలకు అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్‌లో అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకులు (వ్యాయామ విద్య) అవార్డుల కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ ఆదేశించారు. పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహిస్తూ విద్యార్థులను రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు తీర్చిదిద్దేలా మరింత కృషి చేయాలని సూచించారు.

వీఆర్‌కు కానిస్టేబుల్‌

కులశేఖర్‌రెడ్డి

తాడిపత్రిటౌన్‌: తాడిపత్రి కానిస్టేబుల్‌ కులశేఖర్‌రెడ్డిని ఎస్పీ జగదీశ్‌ శుక్రవారం వీఆర్‌కు పంపారు. ఇటీవల ఓ మహిళ కుటుంబ సమస్యలతో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె నంబరును సేకరించిన కానిస్టేబుల్‌ కుల శేఖర్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి వేళ ఫోన్‌ చేశాడు. తనతో అసభ్యకరంగా మాట్లాడాడని కానిస్టేబుల్‌పై బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ అనంతరం సదరు కానిస్టేబుల్‌ కులశేఖర్‌రెడ్డిని వీఆర్‌కు బదిలీ చేసినట్లు తెలిసింది.

30న డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు ఈ నెల 30న అనంతపురంలోని కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎం.వి.లక్ష్మయ్య తెలిపారు. ఇన్‌స్టంట్‌ పరీక్షలకు అర్హత కలిగి, నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు ఆదివారం ఉదయం 10 గంటలకు కేఎస్‌ఎన్‌ కళాశాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ 5వ సెమిస్టర్‌ హాల్‌ టికెట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement