యాప్‌తో విక్రయించకుంటే లైసెన్సులు రద్దు | - | Sakshi
Sakshi News home page

యాప్‌తో విక్రయించకుంటే లైసెన్సులు రద్దు

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

ఆత్మకూరు: ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ఎరువులు (యూరియా, డీఏపీ) విక్రయించకపోతే ఎరువుల దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి సూచించారు. బుధవారం ఆత్మకూరులోని ఫర్టిలైజర్‌ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఎంత సరుకు విక్రయించారు? ఎంత మేరకు రికార్డుల్లో నమోదు చేశారు? అన్న విషయాలను తెలుసుకున్నారు. విక్రయాలకు సంబంధించిన రికార్డులు పక్కాగా లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని తమ దృష్ఠికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తన వేరుశనగ కోసం రైతులు రైతు సేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకట్‌కుమార్‌, ఏఓ జ్యోతి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ప్రాధేయపడినా

ఒక్కరూ చేరలేదు

గుమ్మఘట్ట: తాళ్లకెరలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో 2026–2027 విద్యాసంవత్సరానికి గాను ఒకటో తరగతి అడ్మిషన్‌ ఒక్కటీ కాలేదు. గ్రామంలో 75 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఒకటో తరగతిలో చేరడానికి అర్హత ఉన్న పిల్లలు నలుగురు ఉన్నారు. ఉపాధ్యాయులు అడ్మిషన్‌ కోసం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ద్వారా అందే ఉచిత విద్య, సౌకర్యాల గురించి వివరించారు. ఎంత ప్రాధేయపడినా పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేయలేదు. ఒకటో తరగతికి ఒక్క విద్యార్థీ లేకుండా పోయారు. ఇక్కడ రెండో తరగతి నుంచి ఏడో తరగతి వరకు 45 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని కృష్ణాపురం, కోనాపురం, గొల్లలదొడ్డి గ్రామాలలో అయితే ఒక్కొక్కరు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం పొందడం గమనార్హం.

ఎంపీఆర్‌ను

పర్యాటకంగా తీర్చిదిద్దుతాం

గార్లదిన్నె: పెనకచెర్లలోని మిడ్‌ పెన్నార్‌ రిజర్వాయర్‌ (ఎంపీఆర్‌)ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి ఎంపీఆర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న డ్యాం గేట్ల మరమ్మతును పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ ఎంపీఆర్‌ (డ్యాం) వద్ద వసతుల కల్పన, రోడ్డు నిర్మాణం, బోటింగ్‌ సౌకర్యం, వసతి సముదాయాలకు మరమ్మతులు, సుందరీకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో రిసార్ట్‌ హోటల్‌ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న భవన సముదాయ గెస్ట్‌ హౌస్‌లను పునరుద్దరిస్తామని చెప్పారు. డ్యాం అందాలను, బ్యాక్‌ వాటర్‌ను సురక్షితంగా ప్రజలు వీక్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్‌, టూరిజం, రోడ్డు భవననాలు, రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, అటవీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో డ్యాం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుధాకర్‌రావు, జిల్లా పర్యాటక అధికారి ఓబులమ్మ, తహసీల్దార్‌ ఈరమ్మ, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ గోపాల్‌, దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement