సాయం కోసం ఎదురుచూపు | - | Sakshi
Sakshi News home page

సాయం కోసం ఎదురుచూపు

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

అనంతపురం అగ్రికల్చర్‌: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి సారించడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఏడాది రూ.400 కోట్ల మేర ‘అన్నదాత సుఖీభవ’ సొమ్ము ఇవ్వకుండా ఎగ్గొట్టేసిన ప్రభుత్వం... రెండో ఏడాది మాత్రం అతికష్టమ్మీద అందించారు. అందులోనూ 25 వేల మంది వరకు రైతులకు జాబితాలో చోటు కల్పించలేదు. ఇక ఈ ఏడాది సుఖీభవ కింద మొదటి విడత ఎప్పుడిస్తారో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే జిల్లాలో ఖరీఫ్‌ మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దక్కులు చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా పంట పెట్టుబడులకు ఇబ్బంది పడుతూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

పథకాల అమలు అస్తవ్యస్తం

ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు, అలాగే 2024 రబీ, 2025 ఖరీఫ్‌లో కరువు మండలాల రైతులకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల మేరకు ఇవ్వాల్సిన పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) గురించి చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. గత రెండేళ్లకు సంబంధించి రూ.120 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీ పెండింగ్‌లో పెట్టేశారు. ఇక వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా లాంటి పంటల బీమా పథకాలను అస్తవ్యస్తం చేయడంతో రైతులకు పరిహారం రాకుండా పోతోంది. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉచితంగా అమలు చేసిన పంటలబీమాను చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలని భారం మోపడంతో పాటు నిబంధనల మేరకు పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తుండటంతో రైతులు మండిపడుతున్నారు.

● రబీ–2024, ఖరీఫ్‌–2025లో జిల్లా రైతులు తమ వాటా కింద రూ.కోట్లలో ప్రీమియం చెల్లించారు. ఐదు వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఇన్సూరెన్స్‌ ఏమైందో పాలకులు చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి తమ వాటా ప్రీమియం కంపెనీలకు చెల్లించకపోవడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతున్నట్లు పలువురు చెబుతున్నారు. పంటలు పండక అప్పులపాలై ఈ రెండేళ్లలో దాదాపు 100 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క బాధిత కుటుంబానికి కూడా ఎక్స్‌ గ్రేషియా చెల్లించకుండా మభ్యపెడుతున్నారు.

ఉత్తుత్తి పంట రుణాలు

రైతులకు మేలు జరిగేలా బ్యాంకుల ద్వారా పంట రుణాలు చురుగ్గా కొనసాగుతున్నట్లు చెబుతున్నా.. వాస్తవంగా రైతుల చేతికి పైసా వచ్చే పరిస్థితి ఉండదు. రైతులే బ్యాంకులకు వడ్డీ రూపంలో చెల్లించి గతంలో తీసుకున్న పంట రుణాన్ని నవీకరణ (రెన్యూవల్‌) చేసుకుంటున్నారు. పంట రుణం కింద బ్యాంకులు ఒకసారి మాత్రమే భూవిస్తీర్ణం ఆధారంగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ మేరకు రుణం ఇస్తుంది. ఇక ప్రతి ఏటా ఖరీఫ్‌లో రైతులు ఆ మొత్తానికి వడ్డీ చెల్లించి రెన్యూవల్‌ చేసుకుంటారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌, ఇతరత్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనం వస్తుందనే ఆలోచనతో బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని రెన్యూవల్‌ చేసుకుంటారు.

ఎరువు.. బరువు

● ఎరువుల ధరలు బస్తాపై రూ.250 నుంచి రూ.350 వరకు పెంచేశారు. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతం పెంచడంతో రైతులకు ఎరువు ‘బరువు’ పెరిగిపోయింది. కరువు రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.

రెండేళ్లు పూర్తయినా ఇన్‌పుట్‌, ఇన్సూరెన్స్‌ మాటెత్తని సర్కార్‌

తొలిఏడాది ఎగ్గొట్టి.. రెండో ఏడాది అరకొర ‘సుఖీభవ’ సాయం

మూడో ఏడాది కింద ఎప్పుడిస్తారో స్పష్టత ఇవ్వని చంద్రబాబు

ఖరీఫ్‌ పంట పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న అన్నదాతలు

Advertisement
 
Advertisement
Advertisement