● రైతులకు అధికారుల సలహా
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వం రాయితీపై విత్తన వేరుశనగ కాయల(చెనిక్కాయల)ను పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే దానిస్థానంలో కంది వేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. గతేడాది సాగులోకి వచ్చిన విస్తీర్ణం కన్నా అదనంగా కంది పంట వేసేలా రైతులకు నచ్చజెప్పాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. గత ఖరీఫ్‌లో కంది ఏకంగా 1.35 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా చరిత్రలో తొలిసారిగా వేరుశనగ పంటను అధిగమించి కంది అత్యధిక విస్తీర్ణంతో మొదటి స్థానం ఆక్రమించింది. ఈ ఏడాది 1.50 లక్షల హెక్టార్లు దాటించేలా చూడాలని చెబుతున్నారు. కందితో పాటు మొక్కజొన్న, ఆముదం లాంటి పంటలను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి కారణం రాయితీ విత్తన వేరుశనగ సకాలంలో తగినంత ఇవ్వలేకపోవడమే.
సవాల్‌గా మారిన విత్తన సేకరణ
ఈ ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాకు 56 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాకు 72 వేల క్వింటాళ్లు రాయితీ విత్తన వేరుశనగ అందివ్వాలని కేటాయింపులు చేశారు. అయితే గత ఖరీఫ్, రబీలో రైతులకు పంపిణీ చేసిన వేరుశనగకు సంబంధించి సరఫరా చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్లు, మిల్లర్లకు రాష్ట్ర ప్రభు త్వం రూ.90 కోట్ల మేర బకాయిలు చెల్లించకపోవడంతో ఈసారి విత్తన కొరత ఏర్పడింది. జిల్లాలో గత రబీలో రైతులు పండించిన వేరుశనగను జిల్లాకు చెందిన మిల్లర్లు కొనలేకపోయారు. బకాయిలు ఇంకొంత చెల్లించడంతో పాటు రైతులు చెల్లించే నాన్‌సబ్సిడీ మొత్తం తమకు అందిస్తే మరికొంత విత్తనం సరఫరా చేస్తామని మంగళవారం అనంతపురం కలెక్టర్ ఆనంద్ సమక్షంలో జరిగిన సమావేశంలో మిల్లర్లు విన్నవించుకున్నారు.


