అదనపు బాధ్యతల నుంచి తప్పుకున్న ఖుష్బూకొఠారి | - | Sakshi
Sakshi News home page

అదనపు బాధ్యతల నుంచి తప్పుకున్న ఖుష్బూకొఠారి

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎఫ్‌ఏసీగా శ్రీనివాసరావుకు బాధ్యతలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఉపసంచాలకురాలు (డీడీ) ఎఫ్‌ఏసీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన బీసీ సంక్షేమశాఖ జిల్లా ఉపసంచాలకురాలు ఖుష్బూ కొఠారి అభ్యర్థనకు కలెక్టర్‌ ఆనంద్‌ ఆమోదం తెలిపారు. దీంతో సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎఫ్‌ఏసీ బాధ్యతలను గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావుకు అప్పగించారు. ఖుష్బూ కొఠారి గత ఏడాది జూలై నుంచి అదనంగా సాంఘిక సంక్షేమశాఖ డీడీ (ఎఫ్‌ఏసీ) బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. అటు బీసీ సంక్షేమ శాఖ, ఇటు సాంఘిక సంక్షేమ శాఖ రెండు కీలక బాధ్యతలతో పాటు జిల్లాలోని వందకు పైగా హాస్టళ్ల పర్యవేక్షణ చేయాల్సి రావడం ఆమైపె తీవ్ర పని భారాన్ని మోపింది. ఇదిలా ఉండగా.. సంక్షేమ హాస్టళ్లలో తరచూ తలెత్తుతున్న వివిధ సమస్యలు, వివాదాలు, పరిపాలనా అంశాలు అదనపు ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతుండటంతో ఈ బాధ్యతలను కొనసాగించడం కష్టసాధ్యంగా మారిందని సమాచారం. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఎఫ్‌ఏసీ బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ఆమె ఉన్నతాధికారులను కోరుతూ వచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఆమె విజ్ఞప్తిపై కలెక్టర్‌ సానుకూల నిర్ణయం తీసుకుని బాధ్యతల మార్పునకు ఆమోదం తెలిపారు. దీంతో సాంఘిక సంక్షేమశాఖ డీడీ (ఎఫ్‌ఏసీ) బాధ్యతలను గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావుకు అప్పగించారు. బుధవారం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement