ప్రణాళికా లోపం..
అనంతపురం క్రైం: ఆర్టీసీ అధికారులు ముందుచూపు లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయాణికులకు శాపంగా పరిణమించేలా ఉన్నాయి. ఇటీవల చంద్రబాబు సర్కారు ఆధునికీకరణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సర్కారు ఏం చెప్పిందో... ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఎలక్ట్రిక్ బస్‌స్టేషన్ నిర్మాణపు పనుల్లో అధికారుల ప్రణాళికా రాహిత్యం కొత్త సమస్యలకు దారితీస్తోంది. అనంతపురం ఆర్టీసీ బస్టాండులో అవసరాలకు మించి స్థలం ఉన్నప్పటికి అధికారులు మాత్రం డిపోలోని గ్యారేజీ ప్రాంతాన్ని నూతన స్టేషన్‌కు వినియోగిస్తున్నారు. ఇప్పటికే నడుస్తున్న సేవలకు ఆటంకం కలిగే విధంగా ప్రత్యేక స్టేషన్, గ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టడంపై ఉద్యోగులు, కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కష్టాలు తప్పవా..?
అనంతపురం ఆర్టీసీ డిపో నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. రోజువారీగా వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఈ డిపోలో బస్సుల పార్కింగ్, మరమ్మతులు, సాంకేతిక విభాగాల నిర్వహణకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ బస్సుల కోసం చేపడుతున్న నిర్మాణాలతో ప్రస్తుతం ఉన్న సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోందని సిబ్బంది పేర్కొంటున్నారు. డిపో పరిధిలో బస్సుల స్టాపింగ్, మరమ్మతుల కోసం ఉపయోగిస్తున్న ప్రాంతాలను తగ్గించడం వల్ల భవిష్యత్తులో సాధారణ సర్వీసుల నిర్వహణ కష్టమయ్యే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాకముందే ప్రస్తుతం నడుస్తున్న బస్సులను ఇతర డిపోలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఎందుకిలా..?
అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే డిపో వెలుపల లేదా అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో ఎలక్ట్రిక్ బస్సుల స్టేషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉండేదని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.అలా చేసి ఉంటే స్థల సమస్యలు,సర్వీ సులపై ప్రభావం, సిబ్బంది బదిలీల వంటి అంశాలు తలెత్తేవి కావని అంటున్నారు. సరైన ప్రణాళిక లేకపోతే ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికై నా ఉన్న సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయంపై ఇన్‌చార్జ్ ఆర్‌ఎం శ్రీలక్ష్మిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
‘అనంత’ డిపోలోని గ్యారేజీ ప్రాంతంలో ఎలక్ట్రిక్ బస్‌స్టేషన్ నిర్మాణ పనులు
ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన
భవిష్యత్తులో ఇబ్బందులు
తప్పవంటున్న వైనం
విద్యుత్ బస్సులను సంస్థ ద్వారా నడిపాలి. అనంతపురంలో ఉన్న సర్వీసులను రద్దు చేసి స్థానికంగా సిబ్బందిని ఇతర డిపోలకు సాగనంపడాన్ని యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రయాణికుల డిమాండ్ తగ్గట్టుగా సీ్త్రశక్తి పథకానికి బస్సుల సంఖ్య పెంచాలి. ఖాళీ స్థలాన్ని వినియోగించుకోకుండా డిపోలో కొత్త స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో ప్రయాణికులకు, బస్సులను భద్రపరుచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరో 20 ఏళ్ల ప్రణాళికతో పనులు చేపట్టి ఉంటే బాగుండేది.
– వి. సూరిబాబు, ఏపీపీటీడీ జిల్లా చైర్మన్
భవిష్యత్తులో
ఇబ్బందులు తప్పవు..


