అనంతపురం టౌన్: పీఎం సూర్యఘర్ పనులు వేగవంతం చేయాలని ఇంధన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. బుధవారం విద్యుత్ శాఖ ఎస్‌ఈలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ రూప్‌టాప్ ప్రక్రియ పనులు ఆగస్టు ఆఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 17,500 యూనిట్ల మంజూరులో 4,700 ఇళ్లపై మాత్రమే ఇప్పటి వరకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశారన్నారు. వచ్చే రెండు నెలల్లో 100 శాతం పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య
కూడేరు: కూడేరు మండల పరిధిలోని కొర్రకోడుకు చెందిన గొల్ల రామకృష్ణప్ప (63) బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతనిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రికి 7.30 గంటల సమయంలో మృతి చెందాడు. మృతునికి భార్య అంజనమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆరోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.
పశుసంపదతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
ఉరవకొండ: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుసంపద కీలకమని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమచంద్ తెలిపారు. బుధవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాలకు చెందిన పశుసంవర్ధక శాఖ సిబ్బందికి జంతు కేంద్రీకృత పునరుత్పత్తి నిర్వహణ విధానంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేడీ హాజరై మాట్లాడుతూ రైతులకు సుస్థిర ఆదాయం అందించే విధంగా పాడి పరిశ్రమను పోత్సహించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశుసంపద పెంపుతో గ్రామసంపద పెంపు అనే కార్యక్రమంలో పశువు ప్రత్యుత్పత్తి ఉత్పాదకతపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ పశు కేంద్రీకృత విధానం ద్వారా పశువులను చూడి కట్టించే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గర్భధారణ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. పశువులు చూడి కట్టడం ఒక నెల ఆలస్యమైయితే రైతు రూ.6 వేలు నష్టపోతాడ న్నారు. కార్యక్రమంలో ఉరవకొండ ఏడీ డాక్టర్ ఉమామహేశ్వర్, నాగమల్లేశ్వరావు, డీడీ డాక్టర్ పెద్దన్న, రీసోర్స్ పర్సన్ కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
‘టెట్’ టెన్షన్ తొలగించండి
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ)– 2009కు సవరణలు చేసి సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు నరేష్‌కుమార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్‌టీఈ–2009 చట్టానికి తగిన సవరణలు చేయాలని కోరారు. ఒకవేళ టెట్ నుంచి మినహాయింపు సాధ్యం కాకపోతే, సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించి అర్హత మార్కులను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీకి చైర్మన్‌ను నియమించాలని, ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర జీఓల కమిటీ సభ్యుడు గురురాజ, రాష్ట్ర సాంస్కృతిక కమిటీ సభ్యుడు గోపాల్‌నాయక్, జిల్లా గౌరవాధ్యక్షుడు దేశాయ్ నాగరాజు, సబ్ కమిటీ సభ్యులు రామకృష్ణ, సూర్యనారాయణ, ఓబన్న, రంగనాయకులు, రవి, తూమాటి రమేష్‌బాబు, రాష్ట్ర కౌన్సిలర్లు శివారెడ్డి, జె.వెంకటేశులు, పుల్లయ్య, సూర్యనారాయణ, అనిల్‌కుమార్, లక్ష్మీప్రసాద్, మదన్‌మోహన్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని వివిధ యాజమాన్య పాఠశాలల్లో 2012కు ముందు నుంచి విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను టెట్ పరీక్షల నుంచి మినహాయించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రమణారెడ్డి మాట్లాడారు. 2012కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, రాష్ట్ర సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ టెట్ నుంచి మినహాయింపు సాధ్యం కాకపోతే, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించి అర్హత మార్కులను తగ్గిస్తూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా శాఖ తరఫున పలు సమస్యలను రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుని అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేలా కృషి చేయాలని కోరారు.


