బెళుగుప్ప/ఆత్మకూరు: మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌ను అసిస్టెంట్ కలెక్టర్లు శర్వాన్‌కుమార్‌రెడ్డి, హరిఓం పాండియా, ఆదిత్య శర్మ, నమ్రత్ అగర్వాల్, పవన్ తేజ, ప్రియ, సుయాస్ కుమార్, వెంకటేశ్ బన్నాలు బుధవారం పరిశీలించారు. జీడిపల్లి పంపు హౌస్ వద్ద అసిస్టెంట్ కలెక్టర్లకు తహసీల్దార్ అనిల్‌కుమార్ స్వాగతం పలికారు. రిజర్వాయర్ స్థితిగతులను వివరించారు. అనంతరం హంద్రీ–నీవా చీఫ్ ఇంజినీర్ నాగరాజ,హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఈఈ శ్రీనివాసులు,రెవెన్యూశాఖలఅధికారులతో అసిస్టెంట్ కలెక్టర్లు సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలతో కృష్ణాజలాలు జీడిపల్లికి చేరుకుంటాయని హంద్రీ–నీవా ఉన్నతాధికారులు వివరించగా, రిజర్వాయర్ పరిసరాలు, పంటల సాగుపై మండల రెవెన్యూ అధికారులు వివరించారు. అంతకుముందు ఆత్మకూరు, సిద్దరాంపురం గ్రామ పొలాల్లో రైతులు సాగు చేసిన టమాట, మామిడి పంటలను పరిశీలించారు. మార్కెట్ పరిస్థితిపై రైతులతో ఆరా తీశారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్‌డీఓ వసంతబాబు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ నగేష్‌బాబు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ డీఈ రామసుబ్బయ్య, రిజర్వాయర్ ఏఈలు పృధ్వి, దాదాఖలందర్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ
● 12 తులాల బంగారం,
50 తులాల వెండి, రూ.50 వేల నగదు అపహరణ
గుంతకల్లు: కాశీ యాత్రకు వెళ్లిన ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడి 12 తులాల బంగారం ఆభరణాలతోపాటు 50 తులాల వెండి, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక డీజిల్ షెడ్‌లో పని చేసే జే. తిమ్మరాజు పాత గుంతకల్లులోని అంకాలమ్మగుడి సమీపంలోని సచివాలయం వద్ద నివాసముంటున్నారు. మంగళవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిమ్మరాజు కాశీ యాత్రకు వెళ్లారు. ఇదే అదునుగా దొంగలు మంగళవారం అర్ధరాత్రి ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న విలువైన వస్తువులతోపాటు నగదు అపహరించి పరారయ్యరు. ఇంటి తాళం తెరిచి ఉండటం గమనించిన స్థానికులు తిమ్మరాజుకు ఫోన్‌లో సమాచారం చేరవేశారు. టూటౌన్ పోలీసులకు తిమ్మరాజు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా.. వెంటనే ఇంటి వద్దకు చేరుకుని పరిశీలించారు. క్లూజ్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. టూటౌన్ సీఐ వంశీకృష్ణ మాట్లాడుతూ దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
టపాసుల నిల్వ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం సెంట్రల్: టపాసుల నిల్వ కేంద్రంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. నగర శివారులోని ఫెడ్‌కాన్ క్రాకర్స్ నిల్వ కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లో భద్రపరిచిన నిల్వల వివరాలు చెక్‌లిస్ట్ ప్రకారం పరిశీలించారు. రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి శాఖల సమన్వయంతో సమస్యలు లేకుండా ఫెడ్‌కాన్ క్రాకర్స్ కేంద్రంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయభాస్కర్, ఆర్‌ఐ సందీప్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


