రాప్తాడు రూరల్: బంధువుల ఇంట్లో పెళ్లి సందడి. ఇంటి నిండా నవ్వులు, సరదా మాటలు. ఇంకొద్ది సేపట్లో అందరూ కలుసుకుని ఆనందంగా గడపాలని ఎదురుచూస్తున్న ఓ కుటుంబాన్ని విధి ఒక్క క్షణంలో ఛిద్రం చేసింది. పెళ్లి ఇంటికి చేరుకునేలోపే జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు ప్రాణాలు కోల్పోగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ విషాద ఘటన రాప్తాడు మండలం లింగనపల్లి క్రాస్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రామగిరి మండలం గంగంపల్లికి చెందిన దూదేకుల బాబు (43), భార్య కులుసుంబీ, ఇద్దరు కుమార్తెలు మౌజు, తాసీంభాను (5)తో కలిసి బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరారు. లింగనపల్లి గ్రామానికి చెందిన బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో కుటుంబమంతా ఆనందంగా సన్నాహాలు చేసుకుంది. తండ్రి, పెద్ద కుమార్తె ముందుగానే పెళ్లి ఇంటికి చేరుకున్నారు. భార్య కులుసుంబీ, చిన్నారి తాసీంభాను కొంత ఆలస్యంగా బస్సులో బయలుదేరి రాప్తాడుకు చేరుకున్నారు. బస్సు దిగిన తర్వాత భర్తకు ఫోన్ చేయడంతో, వారిని తీసుకువెళ్లేందుకు బాబు లింగనపల్లి నుంచి బైకుపై వచ్చాడు. భార్య, చిన్న కుమార్తెను బైకుపై ఎక్కించుకుని తిరిగి పెళ్లి ఇంటి వైపు బయలుదేరాడు. లింగనపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై మలుపు తిరుగుతుండగా బెంగళూరు వైపు నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం బైకును ఢీకొంది. ఢీకొన్న వేగానికి బైకుపై ఉన్న ముగ్గురూ దూరంగా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బాబు, ఐదేళ్ల చిన్నారి తాసీంభాను అక్కడికక్కడే మృతి చెందారు. భార్య కులుసుంబీ తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందు తోంది. రాప్తాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కంటతడి పెట్టించిన రోదనలు
అప్పటిదాకా పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘అయ్యో దేవుడా... ఎంత పని చేశావయ్యా’ అంటూ బంధువులు గుండెలవిసేలా విలపించిన దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. పెళ్లి ఇంటికి చేరాల్సిన తండ్రీ కూతుళ్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
చిన్న కుటుంబం చిన్నాభిన్నం
దూదేకుల బాబు పేరూరు గ్రామంలో ఓ కిరాణా దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, ఇద్దరు కుమార్తెలతో నిరాడంబరమైన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. చిన్నారుల భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ జీవిస్తున్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం క్షణాల్లో చిన్నాభిన్నం చేసింది. పెళ్లి వేడుకకు బయలుదేరిన కుటుంబానికి ఎదురైన ఈ విషాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
రాప్తాడు మండలం లింగనపల్లి క్రాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
తండ్రి, కుమార్తె దుర్మరణం


