వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

రాప్తాడు రూరల్‌: రాష్ట్రంలో వ్యవస్థలను శాసించే స్థాయిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇలాంటి అరాచక పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి అరెస్ట్‌ నేపథ్యంలో బుధవారం ఆయన అనంతపురంలో తోపుదుర్తి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. విశ్రాంత జిల్లా జడ్జి కృష్ణప్పతో కలిసి ఆయన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఏడాదిన్నర క్రితం జరిగిన మహేశ్వరరెడ్డి ఆత్మహత్య ఘటనను అప్పటి నుంచి హత్యగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేశారన్నారు. ఆ ఘటనను సాకుగా తీసుకుని తోపుదుర్తి కుటుంబంపై నిందలు మోపి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించారని అన్నారు. ప్రజల్లో ఆ కుటుంబాన్ని చులకన చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించారని పేర్కొన్నారు. చివరకు దర్యాప్తులో మహేశ్వరరెడ్డి మృతిని ఆత్మహత్యగా నిర్ధారించారన్నారు. అయితే మృతుడి తండ్రి ఫిర్యాదులో ఆత్మహత్యకు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి బెదిరింపు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారని గుర్తు చేశారు. అదే ఫిర్యాదులో తన కోడలు అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురై తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కూడా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఏ తప్పూ చేయని తోపుదుర్తి కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించిందన్నారు. ఎలాంటి ఆరోపణలు నిరూపించలేకపోవడంతో చివరకు అక్రమ కేసు బనాయించారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేదలకు విస్తృత స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా పూర్తి రక్షణ, గౌరవం కల్పించారని పొన్నవోలు గుర్తు చేశారు. పోలీసులు కూడా పూర్తి స్వతంత్రంగా వ్యవహరించారన్నారు. శాంతిభద్రతల విషయంలో అప్పట్లో ఎస్పీలు ఎమ్మెల్యేల మాటలు కూడా వినే పరిస్థితి ఉండేది కాదన్నారు. చివరకు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లకు కూడా తగిన రక్షణ కల్పించారన్నారు. నేడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి భద్రతను తొలగించడం సమంజసం కాదని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.

మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

తోపుదుర్తి కుటుంబానికి పరామర్శ

Advertisement
 
Advertisement
Advertisement