అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలంటే అన్ని వర్గాల అభ్యున్నతికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం స్థానిక సంగమేష్‌నగర్ యూనియన్ బ్యాంకులో కొత్తగా ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ, రీటైల్ లోన్ విభాగాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వివిధ సబ్సిడీ రుణాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎంటర్‌ప్రెన్యూర్స్, రైతులు, మహిళలు, ఎఫ్‌పీవోలు, నిరుద్యోగ యువతకు అందించి వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. వినియోగదారులు సంతృప్తి చెందేలా బ్యాంకుల సేవలు పెంచాలని తెలిపారు. విద్య, వాహన, గృహ, ఫుడ్‌ప్రాసెసింగ్ రుణాలు కూడా పెంచాలన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలకు విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజక వర్గ పరిధిలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు తిరుపతి జోనల్ జనరల్ మేనేజర్ శ్రీపతిశ్రీనివాసన్, రీజనల్ హెడ్ వంశీక్రిష్ణ, ఆర్‌ఎల్‌పీ విభాగం అధికారి కొసిగి వెంకటేశ్వర్లు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
విరివిగా రుణాలివ్వాలని కలెక్టర్ సూచన


