అనంతపురం సిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో రోజుకో సంచలన ఘటన చోటుచేసుకుంటూనే ఉంది. తాజాగా బుధవారం పదేళ్ల బాలికను ఓ యువకుడు అపహరించేందుకు యత్నించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన బాబ్జాన్, తస్మియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడో సారి గర్భం దాల్చిన తస్మియాను కాన్పు కోసం కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. మంగళవారం రాత్రి పండంటి ఆడబిడ్డకు తస్మియా జన్మనిచ్చింది.
మనస్థిమితం లేక..
మంగళవారం రాత్రి నుంచి బాబ్జాన్ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ ఆస్పత్రి ఆవరణలో సంచరించసాగాడు. కుటుంబసభ్యులు సముదాయించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఎమర్జెన్సీ వార్డు వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఉన్న ఓ బాలికను తన కుమార్తెగా భావించిన బాబ్జాన్ వెంటనే ఆ చిన్నారిని ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. అజ్ఞాత వ్యక్తి ఒక్కసారిగా తనను ఎత్తుకోవడంతో భయపడిన బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడే ఉన్న బాలిక కుటుంబసభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై బాబ్జాన్‌ను ఔట్‌పోస్టు పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని బాబ్జాన్‌ను స్టేషన్‌కు తరలించి, విచారణ చేపట్టారు.


