చంద్రబాబుకు వెన్నుపోటు అలవాటే | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు వెన్నుపోటు అలవాటే

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

అనంతపురం: నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ, బీజేపీ, జనసేన వెన్నుపోటు పార్టీలని అభివర్ణించారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజలతో ఓట్లు వేయించుకుని... అధికారంలోకి వచ్చాక వారికే వెన్నుపోటు పొడిచాయని మండిపడ్డారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేయని హామీలు, ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గస్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రెండేళ్ల పాలనపై అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. హంద్రీ–నీవా ద్వారా 240 రోజుల్లో 51 టీఎంసీలు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. రాయలసీమ లిఫ్ట్‌ పనులు నిలిపివేసి తీవ్ర అన్యాయం చేసిన మాటేమిటని నిలదీశారు. శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోనే తెలంగాణ నీటిని తోడేస్తున్నా ప్రశ్నించలేని పరిస్థితి ఉందన్నారు. హంద్రీ–నీవా విస్తరణతో పాటు రాయలసీమ లిఫ్ట్‌ పూర్తయితే తక్కువ సమయంలో ఎక్కువ నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. తన స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం సీమ హక్కులను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి చంద్రబాబు తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. సూపర్‌ సిక్స్‌ హామీల అమలులోనూ వైఫల్యం చెందారని, యువత, విద్యార్థి, మహిళలు, రైతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలకూ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్‌

రౌండ్‌ టేబుల్‌ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ఆకట్టుకుంది. రెండేళ్లుగా అనంతపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలిచి చేసిన పోరాటాలను గుర్తు చేసేలా ఫొటో ఎగ్జిబిషన్‌ ఆలోచింపజేసింది. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌ బేగ్‌, ఎద్దుల అమరనాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, గౌని నాగన్న, పూజారి రాజశేఖర్‌ యాదవ్‌, కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, డాక్టర్‌ శంకరయ్య, కట్టుబడి తానీషా, మల్లెమీద నరసింహులు, కొర్రపాడు హుస్సేన్‌ పీరా, గువ్వల రాజేష్‌రెడ్డి, ఫయాజ్‌, చింతకుంట మధు, బాకే హబీబుల్లా, వీరా రామకృష్ణా రెడ్డి, గుజ్జల నగేష్‌, ఆసిఫ్‌, వెన్నపూస రామచంద్రారెడ్డి, సంపంగి రామాంజినేయులు, మలెల్ల వేణుగోపాల్‌, సాకే కుళ్లాయిస్వామి, సాకే అశోక్‌, మాలపాటి శ్రీనివాసులు, చిలకల థామస్‌, దత్త, జాహ్నవి, భానుమతి, వరలక్ష్మి, శశికళ, హజరాంబీ, రాధా యాదవ్‌, పద్మ, శోభాబాయి, శోభారాణి, ఉష, అంజలి, ప్రసన్న పాల్గొన్నారు.

అనంతపురంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’పై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న అనంత వెంకటరామిరెడ్డి, హాజరైన నేతలు

మహిళలను దగా చేశారు

చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని జెడ్పీ చైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ విమర్శించారు. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసే రీతిలో పాలన సాగుతోందన్నారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసి.. ఆడబిడ్డ నిధి తదితర పథకాలు అమలు చేయకుండా మహిళలను దగా చేశారని మండిపడ్డారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న అనంతపురంలో నిర్వహించే ర్యాలీ, మానవహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు.

సంక్షేమ పథకాల ప్రదాత జగన్‌

సంక్షేమ పథకాల ప్రదాతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ అనంతపురం నియోజకవర్గ పరిశీలకుడు బోయ తిప్పేస్వామి కొనియాడారు. గత వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో ప్రజల సంక్షేమానికి పాటుపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు రెండేళ్ల పాలన వెన్నుపోటుకు చిరునామాగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలు గురించి ప్రశ్నించిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ విమర్శించారు. ప్రజల తరఫున నోరెత్తకుండా కేసుల నమోదుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలన, చంద్రబాబు రెండేళ్ల పాలనకు మధ్య తేడాను వివరించారు. చంద్రబాబు అడుగడుగునా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పథకాల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు

‘రెండేళ్ల వెన్నుపోటు’ పాలనపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

వెన్నుపోటుల్లో దిట్ట చంద్రబాబు

వెన్నుపోట్లు పొడవడంలో చంద్రబాబు దిట్ట అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాలనూ మోసం చేశారన్నారు. మామ ఎన్టీఆర్‌, బామ్మర్ది బాలకృష్ణకు వెన్నుపోటు పొడిచినట్లే ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, నదీం అహమ్మద్‌, ఎస్‌ఈసీ సభ్యులు లింగాల శివశంకర్‌రెడ్డి, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌, మాజీ మేయర్‌ వసీం సలీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, మొఘల్‌ సైఫుల్లా బేగ్‌, రిలాక్స్‌ నాగరాజు, కొండ్రెడ్డి ఓబిరెడ్డి, శ్రీదేవి, చంద్రశేఖర్‌ యాదవ్‌, ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, సాకే చంద్రలేఖ, దాసరి వాసంతి సాహిత్య, కృష్ణవేణి, భారతి తదితరులు ‘చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు’ గురించి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement