● ఈజీగా స్టాక్ మార్కెట్ మోసాలు
● అప్రమత్తంగా లేకపోతే మోసపోవడం ఖాయం
● ఆర్థికంగా చితికిపోతున్న బాధితులు
అనంతపురం సిటీ: డబ్బు మీద అత్యాశ కొంప ముంచుతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నేడు సన్నగిల్లింది. దాని స్థానంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఊపందుకుంది. ధనిక వర్గాల వారికే పరిమితమైన స్టాక్ మార్కెట్ వ్యాపారం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సామాన్య, మధ్య తరగతి వర్గాలకూ విస్తరించింది. ఈ క్రమంలో ప్రతి వంద మందిలో 15 మంది స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో చాలామంది మోసపోతున్నారు. సంపాదించి పొదుపు చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, అయితే అప్పులు చేసి పెట్టుబడులు పెడితే ప్రపంచ వ్యాప్తంగా ఏది జరిగినా కంపెనీలపై ప్రభావం పడి నష్టాలపాలు కాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
సామాజిక మాధ్యమాలే లక్ష్యంగా..
పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు కొన్ని కంపెనీలు వూహ్యాత్మకంగా అడుగులేస్తున్నాయి. పెట్టుబడిదారులు అప్రమత్తంగా లేకపోతే మోసపోవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఏదైనా ఓ కంపెనీ నష్టాల బాటలో ఉన్నప్పుడే షేర్లను అమ్మకానికి పెడుతుందనే విషయాన్ని మరవరాదని అంటున్నారు. ఈ క్రమంలో షేర్ల విలువను పెంచుకునేందుకు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర మాధ్యమాల కేంద్రంగా మోసాలకు తెరతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ముందుగా తమ కంపెనీలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయని నమ్మిస్తారు. దీంతో నమ్మి డీమాట్ ఖాతా తెరిచి యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే ఐపీఓ అలాట్ అయినట్లు, మంచి లాభాలు వస్తున్నట్లుగా కనిపిస్తాయి. అయితే స్టాక్స్ అమ్మి డబ్బు విత్‌డ్రా చేయాలనుకుంటే సాధ్యం కాదు. చివరకు డబ్బులు విత్ డ్రా చేయాలన్నా ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుంది.
మాయలో చిక్కుకున్న మేధావి వర్గం
షేర్ మార్కెట్ వలలో సామాన్యులే కాదు మేధావి వర్గాలు సైతం చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఇటీవల వెలుగుచూసిన మోసాలు పలువురిని బెంబేలెత్తించాయి. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి రూ.2.58 కోట్లు నష్టపోయినట్లు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అలాగే ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.72 లక్షలు మోసపోవడం గమనార్హం. అలాగే అనంతపురంలోని బళ్లారి బైపాస్‌లో నివాసముంటున్న ప్రధానోపాధ్యాయుడు భాస్కర్‌బాబు సైతం తెలిసిన వారి నుంచి కొంత, లోన్ యాప్‌ల ద్వారా మరికొంత అప్పులు చేసి రూ.60 లక్షల వరకు ‘ఆరిజన్ కంపెనీ’లో పెట్టుబడులు పెట్టి నిండా మోసపోయారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించలేని స్థితిలో ఒత్తిళ్లు తాళలేక సూసైడ్‌నోట్ రాసి కూడేరు మండలం కమ్మూరు సమీపంలోని ఓ వెంచర్‌లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్‌కుమార్‌రెడ్డి అనంతపురంలోని సాయినగర్‌లో ఆరిజన్ సొల్యూషన్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. సదరు కంపెనీలో పెట్టుబడులు పెడితే పదింతల లాభం ఉంటుందని పలువురిని నమ్మించాడు. కంపెనీ సిబ్బందితో పాటు బంధువులు, స్నేహితులతో పెట్టుబడులు పెట్టించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు పెట్టుబడిపై రూ.5, రూ.10 వడ్డీ చొప్పున లాభాల రూపంలో చెల్లిస్తూ వచ్చాడు. దీంతో నమ్మకం పెరిగిన వారు మరికొందరిని ప్రమోట్ చేశారు. అలా ఒక్కొక్కరు రూ.4 లక్షలు మొదలుకుని రూ.90 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే నెలలు తిరగక ముందే రూ.25 కోట్లకు పైగా వసూలు చేసుకుని ఓ రోజు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి నరేష్‌కుమార్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సదరు కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారందరూ సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం.
ఆత్మకూరు మండలానికి చెందిన ఓ విద్యావంతురాలు కొన్ని నెలల క్రితం అనంతపురంలో ఆరిజన్ కంపెనీ నిర్వహిస్తున్న షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజులు లాభాలు సక్రమంగా చెల్లించడంతో నమ్మకం ఏర్పడింది. దీంతో ఇంట్లో ఉన్న బంగారు నగలు మొత్తం తాకట్టు పెట్టి రూ.90 లక్షల వరకు పెట్టుబడిన తర్వాత కంపెనీ నిర్వాహకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చివరకు తాను మోసపోయినట్లుగా తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
ఈ పరిస్థితి ఈమె ఒక్కరిదే కాదు. ఉమ్మడి
అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎందరో బాధితులు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ మాయలో చిక్కుకుని ఆర్థిక నష్టాలతో కుదేలవుతున్నారు.


