అనంతపురం అగ్రికల్చర్: కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ఎలా ఉందనే దానిపై కలెక్టర్ ఆనంద్ అనంతపురంలో, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ బుక్కరాయసముద్రం మండలంలో దుకాణాలకు వెళ్లి పరిశీలించారు. జేడీఏ సాలురెడ్డి, ఏడీఏ వెంకటకుమార్, ఏఓ శ్యాంసుందర్‌రెడ్డి తదితరులను వెంట బెట్టుకుని ఎరువుల దుకాణాల్లో ఆన్‌లైన్ పద్ధతిలో పంపిణీ గురించి తెలుసుకున్నారు. యాప్ పనితీరు గురించి అధికారులు, డీలర్లను అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి ఇష్టారాజ్యంగా యూరియా, డీఏపీ అమ్మడానికి వీలులేదన్నారు. సాగు చేసిన పంటల విస్తీర్ణం బట్టి రైతులకు ఎంత మేర అవసరమో ఆ మేరకు ఎరువులు ఇవ్వాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మందుల కొరత రానివ్వొద్దు
అనంతపురం సిటీ: జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, సర్వజనాస్పత్రిలో మందుల కొరత తలెత్తకుండా సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురంలోని ఏపీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ మందులు సక్రమంగా సరఫరా కావడం లేదంటూ పీహెచ్‌సీల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. నిల్వ ఉన్న మేరకు అన్ని ఆస్పత్రులకూ మందులు సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
సెప్టెంబర్ 30లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
అనంతపురం టౌన్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇళ్లను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27వేల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అలాంటి ఇళ్ల నిర్మాణాలు 100 శాతం పూర్తి చేసుకుంటేనే బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. సెప్టెంబర్ ఆఖరులోగా పూర్తయిన వాటికే బిల్లులు వస్తాయని స్పష్టం చేశారు. మిగిలిన ఇళ్లకు బిల్లులు విడుదలను కేంద్ర ప్రభుత్వం ఆపివేయనున్నట్లు తెలిపారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
పుట్లూరు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ పి.జగదీష్ అన్నారు. మంగళవారం ఆయన మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో శక్తి యాప్, సీ్త్రరక్ష పోర్టల్ సేవలు, మహిళా రక్షణ చట్టాలు తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ధైర్యంగా వెంటనే పోలీసులను సంప్రదించాలని తద్వారా చట్టం వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుందన్నారు. మహిళల భద్రతకు కుటుంబ, సామాజిక స్థాయిలో అందరూ బాధ్యత వహించాలన్నారు. ప్రయాణాల్లో ఉన్న సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా వేధింపులు, అసభ్య ప్రవర్తన ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అదనపు ఎస్పీ మహబూబ్‌బాషా, సీఐ సత్యబాబు, ఎస్‌ఐలు రామాంజనేయరెడ్డి, సురేంద్రబాబు పాల్గొన్నారు.
ఖరీఫ్ ఈ–క్రాప్ మొదలైంది
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ ఈ–క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే) మొదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ ఒకటి నుంచి పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఖరీఫ్ కింద సాగు చేసిన అన్ని రకాల పంటలను సెప్టెంబర్ 15లోపు ఈ–క్రాప్‌తో పాటు ఆధార్ బేస్డ్ కింద ఈ–కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు ఆర్‌ఎస్‌కే స్థాయిలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించి తుది జాబితా సెప్టెంబర్ 30న ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.


