● సచివాలయానికి తాళం వేసిన తూమకుంట గ్రామస్తులు
కుందుర్పి: తాగునీటి ఎద్దడి తీవ్రమైనా పట్టించుకునేవారు లేకపోవడంతో విసుగెత్తిపోయిన తూమకుంట గ్రామస్తులు మంగళవారం ఖాళీ బిందెలతో వెళ్లి గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన తెలియజేశారు. సమస్య పరిష్కరించేదాకా తాళం తీసేది లేదని మహిళలు భీష్మించారు. 1,600 మంది జనాభా కలిగిన తూమకుంటకు రెండు గ్రామపంచాయతీ బోర్ల ద్వారా కుళాయిలకు నీటిని సరఫరా చేసేవారు. అయితే రెండు నెలల క్రితం బోర్లల్లో నీళ్లు అడుగంటాయి. కుళాయిలకు నీరు బంద్ అయ్యింది. ప్రారంభంలోనే గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. అప్పట్లో పంచాయతీ సెక్రటరీ సమస్య పరిష్కరిస్తామని ఫోన్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత పట్టించుకున్నది లేదు. గ్రామస్తులు సుదూరంలో ఉన్న వ్యవసాయ పొలాలబాట పట్టారు. సైకిళ్లు, మోటారు బైకులు, ట్రాక్టర్లు, ఎద్దులబండ్లల్లో వెళ్లి నీటిని తెచ్చుకుని వాడుకునేవారు. కొంతమంది గ్రామంలోకి వచ్చే ఆటోల్లో తీసుకొచ్చే ఫిల్టర్ వాటర్‌ను బిందె రూ.10 చొప్పున కొంటున్నారు. రోజురోజుకూ నీటి సమస్య పెరిగిపోతుండటంతో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి విన్నవించుకునేందుకు వెళ్తే ఎంపీడీఓ లక్ష్మీశంకర్ అందుబాటులో ఉండటం లేదు. అధికారుల తీరును నిరసిస్తూ సచివాలయానికి చేరుకుని, సిబ్బందిని బయటకు పంపి తలుపులకు తాళం వేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రెండు గంటల తర్వాత ఎంపీడీఓ ఫోన్ ద్వారా గ్రామస్తులతో మాట్లాడి వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.


