●వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య
కళ్యాణదుర్గం: జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మరోమారు సీఎంను చేసుకుందామని వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అధికారం కోసం అలవికాని హామీలను గుప్పించి రాష్ట్రంలోని మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను ప్రతి ఒక్కరినీ నిలువునా మోసం చేశారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోతున్నారన్నారు. కనీసం రైతులకు ఎరువులు అందించలేని పరిస్థితిని రాష్ట్రానికి తీసుకువచ్చారని విమర్శించారు.


