● ప్రజలను చంద్రబాబు దగా చేశారు
● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి
ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలన అవినీతి, అరాచకాలతో నిండిపోయిందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా చర్చావేదిక (రౌండ్‌టేబుల్ సమావేశం) నిర్వహించారు. పార్టీ పంచాయతీ రాజ్ విభాగం నాయకుడు బసవరాజు అధ్యక్షతన జరిగిన చర్చావేదికలో ‘విశ్వ’ మాట్లాడారు. చంద్రబాబు జీవితమంతా మోసాలు, అబద్దాలేనన్నారు. అన్ని వర్గాల ప్రజలు దీన్ని గుర్తించారన్నారు. రెండేళ్లలోనే ప్రజలను వంచించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేవలం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి హింసారాజకీయాలు ప్రోత్సహిస్తున్నారన్నారు. గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. తన హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేస్తే, అందులో రూ.2.80 లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో వేశారన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. గొప్ప మానవతా వాదిగా జగన్ పాలన సాగించారన్నారు. చంద్రబాబు నేడు మహిళలు, రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకూ మోసం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఉరవకొండ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో పేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేసిన ఘనత తమదేనని తెలిపారు. రాయలసీమ జిల్లాల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కె.వి. రమణ మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో కనీసం 50 శాతం అయినా నెరవేర్చలేని అసమర్థుడు చంద్రబాబు అన్నారు. ప్రజలను మోసగించి అధికారంలోకి రావాలన్న తపన తప్ప హామీల అమలుపై చిత్తశుద్ధి లేదన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా మేధావి వర్గాల సంఘం ప్రతినిధి కొండారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, మోసాలేనని, అధికారం కోసం ఎంతకై నా దిగజారతారని విమర్శించారు. బాబును నమ్మి ఓట్లు వేస్తే అందరినీ నట్టేట ముంచుతారన్నారు. చర్చావేదికలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తూలురు అశోక్, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దార్థ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాకే పురుషోత్తం, వికలాంగుల సంఘం అధ్యక్షుడు వడ్డే ఆంజినేయులు, పంచాయతీరాజ్ విభాగం నాయకులు యోగేంద్రరెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, మాజీ జెడ్పీటీసీ తిప్పయ్య, పార్టీ మండల, రూరల్ సమన్వయకర్తలు ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, ప్రజా, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి, చర్చావేదికలో పాల్గొన్న ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు


