రాప్తాడు రూరల్: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రజల వద్ద ఎండగట్టాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ రాప్తాడు నియోజకవర్గ సదస్సు మంగళవారం అనంతపురం రూరల్ కళ్యాణదుర్గం రోడ్డు బీజీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలు, అక్రమ వసూళ్లు పెరిగిపోయాయని ఆరోపించారు. రెండేళ్ల పాలన ప్రజలకు వెన్నుపోటు, వంచన, విద్రోహం, వినాశనాన్ని మాత్రమే మిగిల్చిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో పాపంపేట ప్రాంతంలో ఇళ్లను కూల్చివేయడం, బినామీల పేరుతో ఈ ప్రాంతంలో వందలాది ఎకరాల భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నారు. నియోజకవర్గంలో పరిటాల సునీత కుటుంబం ఆధ్వర్యంలో భూకబ్జాలు, సెటిల్‌మెంట్ రాజకీయాలు సాగుతున్నా యని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మహిళలకు ప్రకటించిన నగదు సాయం, రైతులకు హామీ ఇచ్చిన పథకాలు, నిరుద్యోగ భృతి అమలు కాలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో అమలైన ఆసరా, చేయూత, సున్నావడ్డీ వంటి సంక్షేమ పథకాలను నిలిపివేశారన్నారు. పేరూరు డ్యాంకు వైఎస్సార్‌సీపీ హయాంలో నీళ్లు తీసుకొచ్చి రైతులకు మేలు చేశామన్నారు. పరిటాల సునీత వచ్చిన తర్వాత డ్యాంలో నీళ్లు లేక రైతులకు అన్యాయం చేశారన్నారు. హంద్రీ–నీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ కారణంగా వేలాది బోర్లు ఎండిపోయాయన్నారు. ఇందుకు పరిటాల సునీత, అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాలన్నారు. జగన్ ప్రభుత్వం ప్రారంభించిన గృహ నిర్మాణ కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారన్నారు. పరిటాల సునీత రాసిన లేఖ 50 వేల నిరుపేద కుటుంబాలకు మరణశాసనం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెచ్చిన పీఏబీఆర్ తాగునీటి పథకం పైప్‌లైన్ పనులను కూడా రాజకీయ కారణాలతో అడ్డుకున్నారని ఆరోపించారు. తన గురించి మాట్లాడే అర్హత సునీతకు లేదన్నారు. అధికారాన్ని పరిటాల కుటుంబం దోపిడీకి వాడుకుందన్నారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం రానివ్వనని భరోసా ఇచ్చారు.
వచ్చేది జగన్ ప్రభుత్వమే
ప్రజలు ఇప్పటికే ప్రభుత్వంపై పూర్తిగా విసుగు చెందారన్నారు. భవిష్యత్తులో వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, మారుతీప్రసాద్, నాగార్జున, మెట్టు గోవిందరెడ్డి, నాయకులు గంగుల సుధీర్‌రెడ్డి, మామిళ్లపల్లి అమర్‌నాథ్‌రెడ్డి, ఓబుగారి హరినాథరెడ్డి, బండి పవన్, గోవిందరెడ్డి, సాకే వెంకటేశు, మజ్జిగ శంకరయ్య, ఆత్మకూరు చంద్రశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ వ్యాప్తంగా మండల స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ సదస్సుకు హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు
నా గురించి మాట్లాడే అర్హత పరిటాల సునీతకు లేదు
రాబోయేది జగన్ ప్రభుత్వమే.. స్థానిక ఎన్నికల్లో విజయం మనదే
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


