విడపనకల్లు: మండల పరిధిలోని మాళాపురం గ్రామంలో మంగళవారం ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మాళాపురానికి చెందిన బోయ పక్కీరప్ప భార్య పాల్తూరు సుంకమ్మ (58) ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలోనే ఉరవకొండ వైపు నుంచి విడపనకల్లు వైపు ద్విచక్రవాహనంలో వెళ్తున్న యువకుడు బలంగా ఆమెను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన సుంకమ్మను 108లో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని పాడి గేదె.. : కారు ఢీకొని పాడి గేదె మృతి చెందిన ఘటన పెద్ద కొట్టాలపల్లి సమీపంలో జరిగింది. గ్రామానికి చెందిన రామకృష్ణ తన పాడి గేదెను మేపునకు తీసుకెళ్తుండగా, బళ్లారి వైపు నుంచి ఉరవకొండ వైపు వెళ్తున్న కారు ఢీకొంది. రూ.80 వేల విలువ చేసే పాడె గేదె మృతితో రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు.
నకిలీ ఎస్‌ఐ అరెస్టు
కళ్యాణదుర్గం: తాను పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ అంటూ నమ్మబలికి ఓ వ్యక్తి వద్ద నుంచి కారు ఎత్తుకెళ్లిన వ్యక్తిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ గణేష్ తెలిపిన మేరకు... శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి ఎస్సీ కాలనీకి చెందిన గంటప్ప గారి అనిల్ కుమార్ ఇటీవల జస్ట్ డయల్ యాప్ ద్వారా కారు యజమాని జి.మనోహర్‌ను సంప్రదించాడు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటోను వాట్సాప్ ద్వారా పంపి తాను పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ అని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే మారుతి సుజుకి డిజైర్ కారు (ఏపీ 39 ఎన్‌టీ 8616)ను రోజువారీ అద్దెకు తీసుకున్నాడు. కారును తిరిగి ఇవ్వకుండా వివిధ ప్రాంతాల్లో మోసాలు చేసేందుకు వినియోగించాడు. అనంతపురం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇలా మోసం చేసినట్లు వెల్లడైంది. నిందితుడు మంగళవారం బోరంపల్లి గ్రామ బస్‌స్టాప్ వద్ద ఉండగా, రూరల్ సీఐ గణేష్ వెంటనే అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కారును, పోలీస్ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ గణేష్, సిబ్బందిని డీఎస్పీ రవిబాబు అభినందించారు.
7 విద్యుత్ సబ్‌స్టేషన్ల మంజూరు
అనంతపురం టౌన్: జిల్లాలో కొత్తగా ఏడు సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. కళ్యాణదుర్గం మండలం బసాపురం, రాయదుర్గం నియోజకవర్గంలోని యర్రగుంట్ల, వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి, రాప్తాడు మండలం బండమీదపల్లి, శింగనమల నియోజకవర్గంలోని బొందలవాడ, గుంతకల్లు నియోజకవర్గం ఖాదర్‌పేటలో 33 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఇక అనంతపురం అర్టీసీ బస్టాండ్‌లో సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.


