గుంతకల్లుటౌన్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న షికారీ ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ శివసాగర్ మంగళ వారం తెలిపారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు తమకు రాబడిన సమాచారం ప్రకారం హనుమాన్ సర్కిల్‌లో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన వెల్లడించారు.
అనారోగ్యంతో కానిస్టేబుల్ కన్నుమూత
తాడిపత్రి రూరల్: తాడిపత్రి అప్‌గ్రేడ్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మదన్‌రాజ్ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. యాడికి మండల కేంద్రానికి చెందిన మదన్‌రాజ్ 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మృతి చెందారు. మృతదేహాన్ని పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లిలో నివాసానికి తీసుకురాగా, ఏఎస్పీ రోహిత్ కుమార్, సీఐ శివగంగాధర్‌రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్, లక్ష్మినారాయణ, శివారెడ్డి నివాళులర్పించారు. తాడిపత్రి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కానిస్టేబుల్ భార్య అరుణకు ఎస్పీ జగదీష్ ఏఎస్పీ రోహిత్‌కుమార్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అన్ని విధాల కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు.
గవిమఠం స్థలాలు
అన్యాక్రాంతం కానివ్వం
ఉరవకొండ: గవిమఠంకు చెందిన భవనాలు, స్థలాలను అన్యాక్రాంతం కానివ్వబోమని జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ అన్నారు. కర్ణాటకలోని చేళ్లగురికిలో ఉన్న గవిమఠం స్థలాలు ఆక్రమణకు గురయ్యాయన్న విషయం తెలుసుకున్న కమిషనర్ మంగళవారం అక్కడికి వెళ్లారు. స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మఠం భూములు, ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. త్వరలోనే భూములకు బహిరంగ వేలం నిర్వహించి లీజుకిస్తామన్నారు. కార్యక్రమంలో మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు పాల్గొన్నారు.


