● డీఈఓ శ్రీనివాసరావు
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో 1.2 తరగతుల విద్యార్థులకు పునాది స్థాయిలో భాషా, గణిత నైపుణ్యాలను మెరుగుపరచడమే ‘జ్ఞాన ప్రకాశ్ ఇయర్–3’ శిక్షణ లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో ఆరు రోజులుగా జరుగుతున్న శిక్షణ మంగళవారం ముగిసింది. జాతీయ విద్యా విధానం–2020 (ఎన్‌ఈపీ), జాతీయ పాఠ్యాచరణ చట్రం (ఎన్‌సీఎఫ్), నిపుణ్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశంతో శిక్షణ చేపట్టారు. పాఠ్య సంస్కరణలు, అభ్యసన ఫలితాల ఆధారిత బోధన, రెడీనెస్ కార్యక్రమాలు, తరగతి గది అంచనా విధానాలు, గణిత ఆటల ద్వారా బోధన, టీఎల్‌ఎం వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. బుక్కరాయసముద్రం విజయభారతి కళాశాలలో జరిగిన ముగింపు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో పునాది నైపుణ్యాల అభివృద్ధే శిక్షణ ప్రధాన లక్ష్యమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచాలని సూచించారు. గుత్తి డివిజన్ డిప్యూటీ డీఈఓ లక్ష్మన్న మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలవాలని, తమ బోధన ద్వారా పిల్లల జీవితాలపై శాశ్వత ప్రభావం చూపగల సామర్థ్యం ఉపాధ్యాయులకే ఉంటుందని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఏఎంఓ వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ శిక్షణలో 1,458 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు. రాప్తాడు మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ముగింపు సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ టి.శైలజ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి భాషా, గణిత అంశాల్లో ప్రాథమిక నైపుణ్యాలు సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కార్యక్రమాల్లో అసిస్టెంట్ ఏఎంఓలు ఫణిరాజ్, నారాయణస్వామి, కేఆర్‌పీలు, డీఆర్‌పీలు పాల్గొన్నారు.


