అనంతపురం అర్బన్: ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యాసవర సరుకుల ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం వామపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల నాయకులు నగరంలో ర్యాలీ నిర్వహించి క్లాక్‌టవర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఎస్‌యూసీఐ, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ), సీపీఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, ఓ.నల్లప, కిషోర్‌బాబు, రాఘవేంద్ర, నాగరాజు, వేమన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేస్తోందని దుమ్మెత్తిపోశారు. నెల రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు, వంటగ్యాస్ ధరలు రెండుసార్లు పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పెరిగిన ధరలతో పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయని ఆందో ళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేరుతో ఢిల్లీ వేదికగా తిరగబడ్డారని, ఇప్పటికై నా ప్రభుత్వాలు ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వామపక్షపార్టీల నాయకులు శ్రీరాములు, రామిరెడ్డి, పద్మావతి, పార్వతీప్రసాద్, లింగమయ్య, రమణ, వలి, ప్రకాష్, పరమేష్, కుళ్లాయిస్వామి, కృష్ణ, వీరనారప్ప, చంద్రశేఖర్, మల్లీశ్వరి, రాధమ్మ, తబ్రేజ్ పాల్గొన్నారు.


