● బుర్రా జయకృష్ణ కుటుంబానికి గ్రామస్తుల అండ
● రూ.1.15 లక్షల ఆర్థిక సాయం
రాప్తాడు రూరల్: మానవత్వం పరిమళించింది. కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలవాలని చేసిన పిలుపునకు గొప్పగా స్పందించింది. కరువుతో పోరాడే అనంతపురం నేలలో మానవత్వం మాత్రం ఎప్పుడూ పచ్చగా ఉంటుందని మరోసారి నిరూపించింది. అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన బుర్రా జయకృష్ణ కుటుంబ దయనీయ పరిస్థితిపై ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ప్రత్యేక కథనం పలువురు దాతల హృదయాలను కదిలించింది. కిడ్నీలు దెబ్బతిని మంచానికే పరిమితమైన జయకృష్ణ కుటుంబానికి ఆయన భార్యే ప్రధాన ఆసరా. ఆమె కూడా ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇద్దరు చిన్నారులతో జీవనం సాగించడం భారంగా మారింది. ఈ పరిస్థితిని వివరిస్తూ ‘కష్టాల సుడిగుండం.. కన్నీటి ప్రయాణం’ శీర్షికతో ప్రచురించిన కథనం పలువురిని కదిలించింది. ముఖ్యంగా కట్టకిందపల్లి గ్రామస్తులు పెద్ద మనసు చాటుకున్నారు. గ్రామస్తులంతా స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ. లక్ష అందించారు. అదేవిధంగా జయకృష్ణ భార్య కుమారి ఫోన్‌పే ఖాతాకు వివిధ ప్రాంతాల నుంచి రూ.15 వేల మేర విరాళాలు అందాయి. ఆపద సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ జయకృష్ణ, ఆయన భార్య కుమారి, పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు.


