సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటకే అందేవి. ఏ పని కావాలన్నా.. ఏ సర్టిఫికెట్లు కావాలన్నా సొంతూరిలోనే లభించేవి. పారదర్శక పాలన.. సత్వర స్పందనతో ప్రజల మన్ననలు అందుకున్న సచివాలయ వ్యవస్థ నేడు సేవల పరంగా అధమస్థానానికి పడిపోయింది. ఇందుకు కారణం | - | Sakshi
Sakshi News home page

సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటకే అందేవి. ఏ పని కావాలన్నా.. ఏ సర్టిఫికెట్లు కావాలన్నా సొంతూరిలోనే లభించేవి. పారదర్శక పాలన.. సత్వర స్పందనతో ప్రజల మన్ననలు అందుకున్న సచివాలయ వ్యవస్థ నేడు సేవల పరంగా అధమస్థానానికి పడిపోయింది. ఇందుకు కారణం

Jun 9 2026 4:48 AM | Updated on Jun 9 2026 4:48 AM

బొమ్మనహాళ్‌ మండలం లింగదహాళ్‌లో ఖాళీగా ఉన్న గ్రామ సచివాలయం

బొమ్మనహాళ్‌: ప్రభుత్వ సేవలు వేగంగా అందించాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలని 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రెవెన్యూ తదితర అన్ని రకాల ప్రభుత్వ సేవలనూ సచివాలయం పరిధిలోనే అందుబాటులోకి తెచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,207 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 10,333 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రజలు గతంలె పనుల కోసం వ్యయప్రయాసలకోర్చి మండల, జిల్లా కేంద్రం వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సచివాలయ సేవలకు అనతికాలంలోనే గుర్తింపు లభించింది. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వం దీని పేరును మార్చేసింది. గ్రామాల్లోని సచివాలయాలను స్వర్ణ గ్రామం అని, పట్టణాల్లోని వాటిని స్వర్ణ వార్డు అని నామకరణం చేసింది. అయితే పేరు మార్చడంపై ఉన్న శ్రద్ధ సేవలను మెరుగుపరచడంపై లేకపోవడం గమనార్హం.

నిత్యం.. ఫీల్డులోనే..

ప్రభుత్వం వివిధ రకాల సర్వేలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు సచివాలయంలో కన్నా ఫీల్డులోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. దీంతో పనిమీద సచివాలయాలకు వస్తున్న ప్రజలకు అక్కడ ఖాళీ కుర్చీలే కనిపిస్తుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని అనేక సచివాలయాల్లో ఇదే పరిస్ధితి నెలకొంది. కొన్ని చోట్ల ఒకరు, ఇద్దరు మాత్రమే కార్యాలయంలో కనిపిస్తున్నారు.

టార్గెట్ల పేరిట వేధింపులు

దిగువస్ధాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ తమను టార్గెట్‌ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని సచివాలయ ఉద్యోగులు మదనపడుతున్నారు. జన గణన, యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే, ఈ–కేవైసీ, స్వచ్ఛ సర్వేక్షణ్‌ వంటి పనులతో సతమతమవుతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు చేత పట్టుకుని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే మనమిత్ర కార్యక్రమాలను వార్డుల్లో ప్రచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది అధికారులైతే వింతపోకడలతో ప్రోగ్రెస్‌ చూపించాలంటూ తీవ్రంగా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరిపాలన కార్యదర్శులకు గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాపర్టీ ట్యాక్స్‌ వసూళ్ల కోసం టార్గెట్‌ విధించారు. ఇలా సచివాలయ ఉద్యోగులపై సొంత విధులతో సంబంధం లేకుండా ఇతర శాఖల పనులన్నింటినీ నెత్తిన రుద్దుతూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. గతంలో వలంటీర్లు చేసే పనులు కూడా ఉద్యోగులతోనే చేయిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తూ తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులం... బానిసలు కాదు

అనంతపురం క్రైం/ అనంతపురం టవర్‌క్లాక్‌: ప్రభుత్వ ఉద్యోగులమే కానీ అధికారులకు వ్యక్తిగత బానిసలు కాదని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతర వేధింపులు, పని ఒత్తిళ్లు, అవమానకరమైన వ్యవహార శైలే కర్నూలు వీఆర్వో హుస్సేన్‌ ఆత్మహత్యకు కారణమయ్యాయని ధ్వజమెత్తారు. వీఆర్‌ఓ మృతి నేపథ్యంలో సోమవారం అనంతపురంలో సచివాలయ ఉద్యోగులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్‌ మీదుగా జెడ్పీ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి పేరు తీసుకొస్తున్న సచివాలయ ఉద్యోగులకు ప్రశంసలు కాకుండా వేధింపులే బహుమతిగా లభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి కారణంగా ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆరోపించారు. ‘సర్‌’ కార్యక్రమంలో 14 శాఖల భాగస్వామ్యం ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, మొత్తం బాధ్యతలను సచివాలయ ఉద్యోగులపైనే మోపి బలిపశువులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల మరణాలపై సమగ్ర విచారణ చేపట్టి.. భవిష్యత్తులో ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సచివాలయ వ్యవస్థపై బాబు సర్కార్‌ నిర్లక్ష్యం

సర్వేల పేరుతో విపరీతమైన ఒత్తిళ్లు

నిత్యం ఫీల్డ్‌లోనే ఉంటున్న ఉద్యోగులు

వెలవెలబోతున్న సచివాలయాలు

సకాలంలో సేవలందక ప్రజల పాట్లు

Advertisement
 
Advertisement
Advertisement